వినేవాడుంటే చెప్పేవాడు ఏదైనా చెబుతాడు. వినేవాడంటే చెప్పేవాడికి లోకువ. వినేవాడుంటే హరిదాసు హరికథను ఇంగ్లీషులో చెబుతాడు.. వంటి సామెతలు ఊరకనే రాలేదు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మాటలు వింటే అవే గుర్తుకొస్తాయి. ఈయనగారికి బీయింగ్ హ్యూమన్ అనే స్వచ్చంద సంస్థ ఉంది. తాజాగా ఈ సంస్థ తరపున ఆయన ఈ-సైకిళ్లను విడుదల చేశాడు. సైకిళ్లలో ప్రయాణం వల్ల పెద్దగా ప్రమాదాలు ఉండవని, కానీ మోటార్‌సైకిళ్లను వేగంగా నడిపితే మాత్రం ప్రమాదకరమని చెప్పాడు. మరో అడుగు ముందుకేసి వాహనాలలో వెళ్లే వారు పాదచారులను గురించి ఆలోచించాలని, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని, షూటింగ్ సమయాల్లో చాలా మంది కుర్రాళ్లు మోటార్ బైక్‌లను ఇష్టం వచ్చినట్లు స్పీడుగా నడపడం చూశానని, అది పక్కన నడిచే పాదచారులకు చాలా ప్రమాదకరమని రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడాడు. దాంతో ఈ మాటలు వినవారికి చిర్రెత్తుకొచ్చింది.
ఈ కండలవీరుడు 2002లో హిట్ అండ్ రన్ కేసులో ఫుల్‌గా మందు తాగి రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిని కారుతో తొక్కించాడు. ఆ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కానీ డబ్బు, పలుకుబడి ఉన్న వాడు కావడంతో తాను కారు నడపలేదని, తన డ్రైవర్ నడిపాడని కేసులో వాదించి నిర్దోషిగా బయటపడ్డాడు. కోర్టులు అతను నిర్దోషి అని చెప్పినా, ప్రజలు మాత్రం వాటిని నమ్మలేదు. ఇక సల్మాన్ వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏమిటో అనుకున్నామని, సల్మాన్ వ్యాఖ్యలను చూస్తే అది నిజమేనని అర్ధమవుతోందని విరుచుకుపడుతున్నారు. మరో నెటిజన్ అయితే సల్మాన్ రోడ్ సేఫ్టీ గురించి చెప్పడమంటే బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా అప్పులు ఎలా కట్టాలి? అని పక్కవారికి హితబోధ చేసినట్లుగా ఉందని ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఇదే సందర్భంలో మరో విషయంకూడా గుర్తుకువస్తుంది. ఇటీవల సచిన్ కారులో వెళుతూ, తనతో సెల్ఫీలు దిగాలని ఉత్సాహపడుతూ, బైక్‌లో తన కారుని చేజ్ చేసిన వారితో సెల్ఫీలు దిగి, హెల్మెట్లు ధరించండి అని యువతకు క్లాస్‌పీకాడు. కానీ అతను కారులో సీట్ బెల్టు పెట్టుకోకపోవడం గమనార్హం. నీతులు మాకు కావు.. ఎదుటి వారికి అంటే ఇదే.