'దంగల్' చిత్రంలో అమీర్‌ఖాన్ కూతురిగా అద్భుతంగా నటించిన నటి ఫాతిమా సనా షేక్. కాగా నాటి కాలంలో తెలుగులోనే తీసుకుంటే శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలలో చిన్న పిల్లగా నటించింది. ఆ తర్వాత పెద్దయిన తర్వాత ఆయన సరసన ప్రియురాలిగా హోయలు ఒలికించింది. ఇక జయసుధ, జయప్రద నుంచి దాదాపు అందరూ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి వారి చిత్రాలలో చిన్న పాత్రలు, బాలనటులుగా నటించి చివరకు వారితోనే డ్యూయెట్లు పాడారు. ఇక శ్రీదేవి అటు ఏయన్నార్‌తో ఇటు నాగార్జున వంటి వారితో కూడా కలిసి నటించింది. కానీ ఇప్పుడు మాత్రం మన టాలీవుడ్ ప్రేక్షకులు వీటిని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక 'దంగల్'లో అమీర్‌కు కూతురిగా నటించి మెప్పించిన ఫాతిమా సనా షేక్ అమీర్ సరసన ప్రియురాలిగా రోమాన్స్ చేస్తోంది. 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'లో అమీర్ సరసన ఈమె ఎంపికైంది. ఇక అమీర్ పక్కన నటించేటప్పుడు అందునా బాలీవుడ్ కాబట్టి ఓ మ్యాగజైన్ కోసం మాల్దీవుల్లో బికినీ ధరించి, హాట్ హాట్ ఫొటో షూట్ చేసింది. కానీ పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలా బికినీ ధరించి ఎందుకు నటించావు? అని ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి. ఆమెపై ఫత్వా జారీ చేయాలని అంటున్నారు.
గతంలో కూడా సానియామిర్జా నుంచి ఎందరో ఇలా మత చాందసవాదానికి గురైనవారే. అది సరే.. పవిత్రమైన రంజాన్ మాసంలో బికినీ వేయడమే తప్పయితే, ఇంతటి పవిత్రమాసంలో ఇంటర్నెట్‌లో ఇలాంటి ఫొటోలు, వీడియోలు చూడటం తప్పు కదా? మతం అనేది కేవలం స్త్రీలకే వర్తిస్తుందా? మగవారు ఏమి చేసినా ఫర్వాలేదా? దీనిపై ముస్లిం మత పెద్దల వద్ద సమాధానం ఉందా...?