తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన హఠాన్మరణంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆయన మరణ వార్తని విని టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ అయితే మొత్తం తరలివచ్చింది. కానీ మెగాస్టార్ చిరంజీవి ఆయనను కడసారి చూసేందుకు రాలేదు. ఆయన చైనాలో ఉన్నాడు కాబట్టి రాలేకపోతున్నానని సంతాపసందేశం పెట్టారు.
ఇక చిరు చైనాలో 80వ దశకం హీరోయిన్లు, హీరోలతో, తన సహనటీనటులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన వెంట ఆయన సతీమణి సురేఖ కూడా ఉంది. గత కొంతకాలంగా దక్షిణాదికి చెందిన 80వ దశకం నటీనటులు ప్రతి ఏడాది కలిసి కొన్నిరోజులు గడుపుతున్నారు. మొదట ఈ ఐడియా రాధిక, సుహాసినిలకు వచ్చింది. గత కొంతకాలంగా మన దేశంలోనే కేరళలో, చెన్నైలో వీరు ఇలా కలుస్తూ వచ్చారు. కానీ ఈసారి చైనాను ఎంపిక చేసుకున్నారు. ఇక దర్శకుడు శంకర్ 'ఐ' సినిమాని చైనాలో తీసిన లోకేషన్లను తెలుసుకుని ఈ జట్టంతా చైనాలో ఆయా లోకేషన్లను, ఇతర ప్రాంతాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది తప్పు కాకపోయినా చిరంజీవి దాసరి మరణ వార్త విన్నవెంటనే ఇక్కడకు రావడమో లేక కనీసం నిన్న జరిగిన సంతాప సభకు హాజరవ్వడమో చేసివుంటే బాగుండేది. ఇక 80వ దశకం నాటి హీరోలు, హీరోయిన్లకు కూడా దాసరి మీద మంచిగౌరవమే ఉంది. వారిలో చాలా మందితో ఆయన చిత్రాలు చేశారు. ఇక బాలకృష్ణ పోర్చుగల్‌లో సినిమా షూటింగ్‌లో ఉండటంతో ఈ జల్సా పర్యటనకు హాజరుకాలేదు. వెంకటేష్ మాత్రం దాసరి మరణవార్త విని ఈ పర్యటనను అందుకోలేదని అంటున్నారు. శ్రీదేవి, చిరంజీవి వంటి వారి వైఖరిపై పరిశ్రమలోని పలువురు మండిపడుతున్నారు.