రావుగోపాలరావు... ఏ పాత్రనైనా తనదైన డైలాగ్ మాడ్యులేషన్, టైమింగ్, బాడీలాంగ్వేజ్‌తో ఆ పాత్రకు 100కి 150శాతం న్యాయం చేసే గొప్పనటుడు. ఆయన గతంలో చేసిన ఎన్నో చిత్రాలలో మహానటుడైన ఎన్టీఆర్‌కు కూడా గట్టి పోటీ ఇచ్చి, నువ్వా? నేనా? అన్నట్లు నటించి ఆబాలగోపాలాన్ని అలరించాడు. ఇక ఆయన మరణం తర్వాత ఉన్నట్లుండి ఆయన కుమారుడు రావు రమేష్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు.
వాస్తవానికి చెప్పుకోవాలంటే రావు రమేష్.. రావుగోపాలరావు వారసుడని చాలా మందికి తెలియదు. తన తండ్రి పేరును పెద్దగా వాడుకోకుండానే తండ్రి తరహాలో విభిన్నమైన పాత్రలు, తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్స్‌తో రావు రమేష్ కూడా అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రావురమేష్‌కి ఎక్కువగా మంచి పేరును తెచ్చే పాత్రలను సృష్టించి ఇచ్చే దర్శకునిగా హరీష్‌శంకర్‌కి మంచి పేరుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒకటి అరా చిత్రాలలో తప్పా ప్రతి చిత్రంలోనూ రావు రమేష్‌కి ఆయన మంచి పాత్రలను ఇచ్చాడు.
ఇక తాజాగా విడుదలైన 'డిజె' (దువ్వాడ జగన్నాథం) చిత్రం ట్రైలర్‌లో కూడా బన్నీ తర్వాత అందరినీ ఆకట్టుకుంటున్న పాత్ర రావు రమేష్‌దే అని చెప్పాలి. ఇందులో గెటప్, డైలాగ్ మాడ్యులేషన్స్‌లో ఆయన తండ్రి రావు గోపాలరావును గుర్తుకు తెస్తున్నాడు. 'నేను మీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదబ్బా.. ఏదో పెద్ద బాలశిక్ష చదువుకున్నానంతే' అనే ఒక్క డైలాగ్‌తోనే విజిల్స్ వేయించుకునే విధంగా ఆయన కనిపిస్తున్నాడు. మొత్తానికి రావు రమేష్‌ను బాగా ప్రోత్సహిస్తున్న దర్శకనిర్మాతలను ఈ విషయంలో మెచ్చుకోకుండా వుండలేం...!