ఒకవైపు 'బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి- ది కన్‌క్లూజన్' చిత్రాలకు గాను ఏకంగా ఐదేళ్లు రాజమౌళికి అప్పగించేసిన యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్‌కు ఆయన కష్టానికి, నమ్మకానికి తగ్గ ప్రతిఫలం దక్కుతోంది. ఏకంగా 2000కోట్లకు పైగా వసూలు చేసి, త్వరలో చైనాలో దండయాత్రకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. ఈ చిత్రం ద్వారా దేశ విదేశాలలో కీర్తి, గుర్తింపుతో పాటు ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టింపజేయాలని ఆశించిన సంగతి తెలిసిందే. మేడమ్ టుస్సాడ్స్ వారు లండన్, బ్యాంకాక్, సింగపూర్, హాంకాంగ్‌లలో ఉండే తమ మ్యూజియాలలో వీటిని ప్రతిష్టిస్తుంటారు. ఇక ప్రభాస్ మైనపు విగ్రహాన్ని వారు 'బాహుబలి-ది కన్‌క్లూజన్' సమయంలో బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సౌతిండియా నుంచి ఈ ఘనతను సాధించిన హీరో ప్రభాసే కావడం తెలుగు సినీ ప్రేమికులకు, మరీ ముఖ్యంగా ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
ఇండియన్ సినిమాపై మక్కువ ఉన్న వారు తమ బ్యాంకాక్ పర్యటనల్లో భాగంగా ప్రత్యేకంగా తరలి వెళ్లి ప్రభాస్ విగ్రహాన్ని చూసి వస్తున్నారు. ఇక వివిధ దేశాలలో ఉన్న ప్రభాస్ అభిమానులు, మన తెలుగు రాష్ట్రాలలోని యంగ్‌రెబెల్‌స్టార్ అభిమానులు కూడా అదే పనిగా బ్యాంకాక్ వెళ్లి, ఈ మైనపు విగ్రహాన్ని చూసేందుకు వెళ్తుండటం విశేషం. వాస్తవానికి ఒక్కోమైనపు విగ్రహాన్ని తయారు చేయడానికి భారీ ఖర్చు అవుతుంది. లక్షా యాభైవేల బ్రిటిష్ పౌండ్లు ఈ అచ్చపు మనిషిలా ఉండే మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు ఖర్చు అవుతాయి. మన దేశ లెక్కలో అది కోటిన్నరకు సమానం.
'బాహుబలి' ద్వారా అద్భుతాలు జరుగుతాయని ఆశించాను గానీ ఏకంగా ఈ ఘనతను సాధిస్తానని ఊహించలేదని, తాను షూటింగ్‌లో ఉన్న సమయంలో వారు తనకు ఫోన్ చేసి విషయం తెలిపారని, ఈ విషయం తెలిసి రాజమౌళి కూడా ఎంతో సంతోషించారని ఇటీవల ప్రభాస్ అన్నాడు. సూపర్‌హీరోలు, స్పైడర్‌మేన్, కెప్టెన్ అమెరికా వంటి గొప్పవారి పక్కన తన విగ్రహం ఉండటం ఎంతో సంతోషంగా ఉందని ప్రభాస్ చెబుతున్నాడు. మీరు హైట్ కదా.. మీ విగ్రహానికి వాక్స్ ఎక్కువగా పడుతుంది కదా..! అని ఇటీవల యాంకర్ సుమ చమత్కరించగా, నిజమే... వారు కొలతలు తీసుకున్నారు గానీ ఎంత వాక్స్ అవసరమవుతుందో తెలియదనుకుంటా.. అయినా మనల్ని డబ్బులు అడగలేదు కదా...! అంటూ ప్రభాస్ కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.
ప్రభాస్ కి వచ్చిన ఈ ఘనత ని చూసి కొందరు గర్వముగా చెప్పుకుంటుంటే..మరి కొందరు మాత్రం..ఈ కీర్తికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.