నాగ్‌ను తెలుగు ఇండస్ట్రీలో మంచి జడ్జిమెంట్, ప్లానింగ్ ఉన్న స్టార్‌గా, బిజినెస్‌మేన్‌గా, ప్రొడ్యూసర్‌గా భావిస్తుంటారు. ఇక ఆయన ఎప్పుడు తన సినిమా మీద అభిప్రాయాలను ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్‌గా చెప్పేస్తుంటాడు. తాజాగా ఆయన తన ఇద్దరు కుమారులైన నాగచైతన్య, అఖిల్‌ల కెరీర్‌ను చక్కదిద్దే బాధ్యతను తాను తీసుకున్నాడు. అనుకున్నదే తడవుగా తానే దర్శకునిగా పరిచయం చేసి 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్‌బస్టర్‌ని అందుకున్న కళ్యాణ్‌కృష్ణను దర్శకునిగా పెట్టుకుని, సెకండ్ సెంటిమెంట్‌ను కూడా నమ్మకుండా నాగచైతన్య నటించిన 'రారండోయ్ వేడుకచూద్దాం' దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు కళ్యాణ్‌కృష్ణ ఏది కోరుకుంటే అది ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై 'బాహుబలి-ది కన్‌క్లూజన్'కి ధీటుగానే నిలిచి, టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రం తనకు 'నిన్నేపెళ్లాడతా, మన్మథుడు' టైప్‌లో చైతూకి బ్రేక్ ఇస్తుందని నాగ్ చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఈ చిత్రం నిర్మాతకు, బయ్యర్లకు రూపాయికి రెండు రూపాయలు లాభం తెచ్చే విధంగా సాగుతూ, వేసవి ముగింపుకి ఘనమైన వీడ్కోలు పలుకుతూ, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణలో ముందుంది. ఇక నాగ్ తన చిన్నకుమారుడు అఖిల్ మొదటి చిత్రాన్ని కూడా తానే నిర్మించాలని భావించాడు. కానీ చైతూని దిల్‌రాజుకు, అఖిల్‌ను వినాయక్-నితిన్‌లకు అప్పగించి తప్పుచేశాడు. దాంతో ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో తమకు 'మనం' వంటి వండర్‌మూవీని అందించిన విక్రమ్ కె కుమార్‌తో రెండు కథలు తయారుచేయించి, మొదటి కథలో కాస్త లోటుపాట్లు ఉండటంతో రెండో కథను ఓకే చెప్పాడు. ఇంకా కథను మెరుగులు దిద్దిస్తూనే హీరోయిన్‌తో పాటు మిగిలిన విషయాలపై దృష్టిపెట్టి, ప్రస్తుతం కేవలం యాక్షన్ సీక్వెన్స్‌లను హాలీవుడ్ స్టంట్‌మాస్టర్స్‌తో చేయిస్తున్నాడు.
ఇప్పటివరకు సినిమాలోని రెండు ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారట. ఇందుకుగానే 12కోట్లకు పైగానే ఖర్చుపెట్టారని సమాచారం. సో.. ఈ చిత్రాన్ని కూడా నాగ్.. అఖిల్ మొదటి చిత్రంలాగానే ఖర్చుకువెనుకాడటం లేదని అర్ధమవుతోంది.