మీడియా దృష్టిని ఆకర్షించడానికి, తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం నిర్మాత దిల్ రాజు తపన పడుతున్నారు. డిజె టీజర్ లాంఛ్ ప్రోగ్రామ్‌కు తమ సంస్థలో పనిచేసిన డైరెక్టర్లందరినీ పిలిపించారు. గ్రూప్ ఫోటోలు దిగారు. అందరిచేత పొగిడించుకున్నారు. దర్శకులందరూ కోరస్‌గా దిల్ రాజు చాలా గొప్ప నిర్మాత అని కితాబునిచ్చారు. 14 సంవత్సరాల్లో 25 చిత్రాలు నిర్మించిన క్రెడిట్ తనదే అని దిల్ రాజు చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది.
దర్శకులందరినీ పిలిపించిన విధంగా తన సంస్థలో నటించిన హీరోలను ఒక్కవేదికపై రప్పించే ధైర్యం ఆయనకు ఉందా? అలా చేయగలరా అని సినీ విశ్లేషకుడు ఒకరు ప్రశ్నించారు. ఇది నిజమే అనిపిస్తుంది. అయితే దిల్ రాజు తలచుకుంటే ఏదైనా చేయగలరు కాబట్టి ఏదో ఒక రోజున తన హీరోలందరినీ పిలిచి గ్రూప్ ఫోటో దిగడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.ఇక పోతే ఇంతమంది యువ దర్శకులు వచ్చారు. సరదాగా గడిపారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దర్శకులకు స్పూర్తి దాయకమైన దాసరి నారాయణరావును కనీసం గుర్తుకుతెచ్చుకోలేకపోయారు. నివాళులు అర్పించలేకపోయారు. ఇలాంటి ఆలోచన రాలేదని అనుకోవాలా? లేక అల్లు కుటుంబం కోసం ఆ ప్రస్తావన తేలేదని భావించాలా? దీనికి వివరణ ఇవ్వాల్సింది దిల్ రాజు మాత్రమే.