ఈ మధ్య కాలంలో వరుసగా భక్తిరస చిత్రాలను రాఘవేంద్రరావు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. 'అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీ మంజునాథ, పాండురంగడు, శిరిడీ సాయి'.. తాజాగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలు తీశాడు. ఈ మధ్యలో బాపు దర్శకత్వంలో బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటించగా 'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని భారీగా నిర్మించిన యలమంచిలి సాయిబాబా తనయుడు రేవంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఇంటింటా అన్నమయ్య' చిత్రం రూపొందింది.
ఇక ఈ చిత్రానికి కూడా రాఘవేంద్రరావు ఆస్థాన సంగీత విద్వాంసుడు కీరవాణి సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ చిత్రం కావడం, కొత్త హీరో కావడం, సినిమా టైటిల్ అందరినీ రీచ్ కాలేకపోవడంతో పాటు రాఘవేంద్రరావుకు కూడా పెద్దగా క్రేజ్ తగ్గి పోవడంతో ఈ భారీ చిత్రం బిజినెస్ కాక విడుదల కాలేదు. ఇప్పటికీ బాక్సుల్లో మూలుగుతూనే ఉంది. ఇక రేవంత్ ఆ తర్వాత నటించిన 'రాజా నువ్వు కేక' చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. ఇందులో రేవంతే కాకుండా మరో ఇద్దరు యువ హీరోలు కూడా నటించారు.
తారకరత్న ఇందులో విలన్ పాత్రను చేస్తుండటం విశేషం. కాగా తన 'ఇంటింటా అన్నమయ్య' చిత్రం కూడా త్వరలోనే విడుదలవుతుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. జర్నలిస్ట్‌నైన తాను పలు డాక్యుమెంటరీలు కూడా తీశానని, అడ్వంచరస్ డాక్యుమెంటరీలంటే తనకు ఎంతో ఇష్టమని, ప్రస్తుతం కేవలం సినిమాలు, డాక్యుమెంటరీల మీదనే దృష్టి పెట్టానని, భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తానని చెబుతున్నాడు ఈ రాఘవేంద్రరావు పరిచయం చేసిన కుర్రహీరో. మిగిలినవన్నీ పక్కనపెట్టి 'ఇంటింటా అన్నమయ్య' చిత్రం విడుదల సంగతి చూసుకుంటే అదే పదివేలని చెప్పవచ్చు.