ఒకప్పటి హీరోయిన్, ఆ తర్వాత తన లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌లతో హీరోలకు సరిసమానమైన ఇమేజ్‌ను తెచ్చుకున్న లేడీ అమితాబ్ విజయశాంతి. కాగా ఆమె ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ నాయకురాలు, ఉన్నట్లుండి నేను కూడా తెలంగాణ వ్యక్తినే అంటూ బిజెపి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లలో చేరడం, మరలా కాంగ్రెస్‌లోకి వచ్చిన ఈమె తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన వెంటనే సీఎం పీఠం కోసం పన్నీరుసెల్వం, శశికళలు పోటీ పడిన సమయంలో అన్నాడీఎంకేను జయలలిత తర్వాత నడపగలిగిన వ్యక్తి కేవలం చిన్నమే అని సంచలన వ్యాఖ్యలు చేయడమే కాదు.. పోయెస్‌గార్డెన్‌కి వెళ్లి మరీ శశికళకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
దాంతో తమిళనాడు ప్రజల, మీడియా, నాయకుల ఆగ్రహానికి ఆమె గురైంది. మా గురించి మాట్లాడేందుకు నువ్వెరు? నీ అనుభవం ఎంత? మా వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.ఇక రెండాకుల గుర్తు కోసం ఈసీకి భారీ మొత్తంలో లంచం ఇవ్వబోయిన దినకరన్ తాజాగా శశికళను జైలులో కలిసి మంతనాలు జరిపాడు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు విజయశాంతి చిన్నమ్మతో సుదీర్ఘ చర్చలు జరిపింది.
వాస్తవానికి సెంట్రల్ జైలులో ఉన్న వారిని సాయంత్రం 5గంటల పైన ఎవ్వరూ కలవకూడదు. ఇక చిన్నమ్మ పరంపర అగ్రహారం జైలులో సాదారణ ఖైదీలా కాకుండా ఓ ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు విలాసవంతంగా ఉంటోందని, సకల సౌకర్యాలను జైలు అధికారులు అనుమతులకు విరుద్దంగా ఆమెకు కల్పిస్తున్నారని అందరూ మండిపడుతున్నారు. గతంలో విజయశాంతి చిన్నమ్మకు ఆప్తురాలే అయి ఉండవచ్చు. కానీ రాత్రి సమయంలో నేరస్తురాలిగా నిరూపితమై జైలులో ఉన్న ఆమెను విజయశాంతి కలవడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశం అయింది.