గతంలో 9ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన చంద్రబాబు పార్టీని, కార్యకర్తలను విస్మరించడంతో చేదు అనుభవం ఎదురైంది. అయినా ఇప్పటికీ చంద్రబాబు ఈసారి అదే పని చేస్తున్నారని కొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలే మండిపడుతున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడం, పలు జిల్లాల్లో ఇంకా జిల్లా అధ్యక్షులను నియమించకపోవడం, రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇంకా భర్తీ చేయకపోవడం వంటివి చంద్రబాబుకు ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు.
ఇక పలు నామినేటెడ్ పదవులకు కూడా బాబు ఎవ్వరినీ నియమించలేదు. పలు మార్కెట్‌యాడ్లు, దేవాదాయ సంస్థల ఖాళీలు ఉన్నాయి. టిటిడి పాలకమండలి, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి, శాప్, 20 సూత్రాల అమలు కార్పొరేషన్, క్రిస్టియన్ ఫైనన్స్ కార్పొరేషన్ వంటి పదవులు ఖాళీగా ఉండటం గమనార్హం. ఇక డిల్లీలో స్థాయిలో ముఖ్యమైన రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ పదవిలో ఎవ్వరినీ నియమించకుండా అంతా తానై ఢిల్లీలో వెలగాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి భావిస్తున్నాడు. అయినా కూడా సుజనాతో పాటు ఆయన అనుచరగణం ఇటీవల జగన్ ప్రధానిని కలవబోయే విషయాన్ని కూడా ముందుగా కనిపెట్టడంలో విఫమైంది.
ఇక లోకేష్‌ని మంత్రిని చేసినా, బాబుగానీ లేదా లోకేష్ గానీ పార్టీని పట్టించుకోవడం లేదనే వాదన పెరుగుతోంది. కానీ చంద్రబాబు అనుచరులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని పదవులను ఏపీలో చంద్రబాబు ఇచ్చారని, కానీ వారు చురుగ్గా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని, తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో నాయకులు విఫలమై, తమ స్వంతలాభాలు చూసుకుంటున్నారని, అందువల్లే బాబు కూడా పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తున్నారు.