బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి.. ప్రభాస్ కి డిమాండ్ బాగా పెరిగింది. బాహుబలి సిరీస్ కి 25 కోట్లు మాత్రమే పారితోషకం అందుకున్న ప్రభాస్ ఆ చిత్రంతో మరింత డిమాండ్ మరియు క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ తో చిత్రాలు నిర్మించడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభాస్ వెంట కొన్ని యాడ్ కంపెనీ లు తమ యాడ్స్ ని ప్రమోట్ చెయ్యమని వెంటపడుతున్నాయి.ఇంతకుముందే ప్రభాస్ ని కొన్ని యాడ్ కంపెనీలు తన బ్రాండ్స్ ని ప్రమోట్ చెయ్యమని గతకొన్నేళ్ళుగా అడుగుతూనే వున్నాయి. అసలు బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయనకు ఒక సోప్ కంపెనీ తమ సోప్ ని ప్రమోట్ చెయ్యమని అడగగా... దీనికి ప్రభాస్ ఒప్పుకోలేదట. ఎందుకు ఒప్పకోలేదని... ప్రభాస్ ని డైరెక్టర్ రాజమౌళి అడగగా... నేను స్క్రీన్ మీద కనబడుతూ ఈ సోప్ రుద్దుకోండి అంటే చాలా చండాలంగా ఉంటుంది డార్లింగ్ అందుకే కాదన్నాను అని చెప్పాడట.
ఇలాంటి చాలా ఆఫర్స్ ప్రభాస్ దగ్గరకి వచ్చినా వాటిని తిరస్కరిస్తూ వస్తున్న ప్రభాస్ ఇప్పుడు మొబైల్ సంస్థ జియోనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసేందుకు ఒప్పుకున్నాడు. జియోనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్ చేసేందుకు అన్ని ఒప్పంద కార్యక్రమాలు పూర్తయ్యాయట. ఇప్పటికే దేశంలో కోటీ పాతిక లక్షల మందికి పైగా కస్టమర్లను కలిగి ఉన్న తమ కంపెనీకి.. ప్రభాస్ తో అగ్రిమెంట్ చేసుకోవడం ప్లస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ కు చాలామందే అంబాసిడర్స్ ఉన్నారు. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ భామ ఆలియా భట్.. సౌత్ బ్యూటీ శృతి హాసన్ లతో పాటు దుల్కర్ సల్మాన్.. దిల్జిత్ దోసంఝ్ కూడా ఈ కంపెనీ ఫోన్లకు ప్రచారం చేస్తున్నారు.
మరి బ్రాండ్ అంబాసిడర్ గా జియోనీ సంస్థ చేసే యాడ్ తో ప్రభాస్ అభిమానులని అలరించబోతున్నాడన్నమాట. ఇక తాజాగా ప్రభాస్, సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు.