కేంద్ర మంత్రిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించిన దాసరి నారాయణ రావును కాంగ్రెస్ పార్టీ మరిచిందా..? ఆయన బతికి ఉన్నపుడు కాపు నేతగా గుర్తించిన వారంతా ఏరీ..? ఇదీ సగటు అభిమానిని వేధిస్తున్న ప్రశ్న.
సహజంగా కేంద్రస్థాయిలో రాజ్యాంగ పదవులు చేసిన వారు మృతి చెందితే జాతీయ స్థాయిలో సంతాప తీర్మానాలు చేస్తారు.వారి సేవలను స్మరణ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇవేమి కనిపించలేదు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తరుపున పెద్ద సభ జరిగింది. రాహుల్‌గాంధీ వచ్చారు. మాట్లాడారు, వెళ్ళారు. కానీ అదే ప్రాంతానికి చెందిన సినీ ప్రముఖుడు, తమ పార్టీ మాజీ కేంద్రమంత్రి దాసరి గురించి మాత్రం నాలుగు మాటలు చెప్పలేకపోయారు.
ఇక దాసరికి కుల ముద్రవేసిన కాపు నేతలు కూడా దాసరి సేవలను విస్మరించడం గమనార్హం. ఆయన బతికి ఉన్నపుడు కులంకోసం వాడుకున్నారు. మృతి చెందాక కనీసం సంతాపసభ సైతం నిర్వహించకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాలు, కులాలు అంటే ఇంతే. భౌతికంగా ఉండి, పలుకుబడి ఉంటేనే గౌరవం. లేదంటే వారిని కనీసం గుర్తుకు తెచ్చుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి.