వైయస్సార్‌సీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా.. జగన్ సీఎం కావాలని అంటున్నారే గానీ జగన్ వస్తే ఏమి చేయనున్నాడు? అనేది మాత్రం చెప్పడంలేదు. తాజాగా వైసీపీ స్థానిక ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కడప జిల్లా ప్లీనరీలో జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిలు రెచ్చిపోయారు. చంద్రబాబులా హామీలు నెరవేర్చకుండా, అవినీతి చేస్తుంటే గల్ఫ్‌వంటి దేశాలలో ఉరి తీస్తారని, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పర్యటనలు చేస్తున్నారని, జనాలకు అనుమతి ఇస్తే వారే చంద్రబాబును నిలువునా చంపేస్తారని ఏదొస్తే అది మాట్లాడుతున్నారు.
జగన్ సీఎం అవుతాడని, కావాలని నోక్కి చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కోట్లకు కోట్లు మేసే నాయకులను, వారి సుపుత్రులను కూడా గల్ఫ్‌లో దొరికితే ఏం చేస్తారో? ఈ నాయకులు చెప్పాల్సివుంది. ఇక ఎప్పుడైతే జగన్ ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లకు శరణుజొచ్చాడో ఆనాడే చంద్రబాబుతో సహా జగన్ కూడా ప్రత్యేకహోదా మీద నిలదీసే హక్కు కోల్పోయాడని సామాన్యులు కూడా ఒప్పుకుంటున్నారు. అసలు గురువింద నీతిని చెబుతున్న ఈ నాయకుల మాటలకు పగలబడి నవ్వాలనిపిస్తుంది. జగన్ వైఫల్యం చూసి చంద్రబాబు, చంద్రబాబు వ్యతిరేకతనే నమ్ముకున్న జగన్‌లను కాకుండా ఏదైనా మూడో ప్రత్యామ్నాయం ఏమైనా వస్తుందా? అని ఏపీ ప్రజలు ఆశగా చూస్తున్న మాట మాత్రం వాస్తవం.