ఎప్పుడైతే ఓ ప్రాంతీయ చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని కలెక్షన్ల సాధించిందో అప్పటి నుంచి అందరిలో 'బాహుబలి'కలలు వస్తున్నాయి. తాజాగా శంకర్, రజినీ, అక్షయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో వస్తున్న '2.0' విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే తమిళ మీడియాలో 'బాహుబలి' చిత్రం కేవలం ఐదారుభాషల్లోనే డబ్ అయిందని, కానీ '2.0' చిత్రం 15 దేశ విదేశీ భాషల్లో రిలీజ్ కానుందని, ఇక 'బాహుబలి' దేశవ్యాప్తంగా 9వేల స్క్రీన్లలో రిలీజ్ అయితే '2.0'ని ప్రపంచ వ్యాప్తంగా 70వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అసలు ప్రపంచంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయో కూడా అర్ధం కాక తలలు పట్టుకునే పరిస్థితి. ఇక 'సంఘమిత్ర' విషయంలో జరిగిన హడావుడి అంతా ఇంతాకాదు. కానీ ఇప్పటికీ షూటింగ్ ప్లానింగ్, పక్కా స్టోరీ రెడీ కాలేదని శృతిహాసన్ విమర్శించింది. మరోవైపు మలయాళ 'రాండామూజం' (మహాభారతం)ను ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదిస్తారట. ఇంతకీ ప్రపంచంలో మొత్తం ఎన్ని భాషలున్నాయో సరిగా గుర్తులేదు. ఇక ఈ కుళ్లు రోగం టాలీవుడ్‌ని కూడా తాకింది. తన మానాన తాను సినిమాలు చేస్తూ అవి రికార్డులు క్రియేట్ చేస్తుంటే ఎంజాయ్ చేసే చిరు కాంపౌండ్ కూడ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' విషయంలో పలువార్తలను లీక్ చేస్తోంది.
అమితాబ్‌బచ్చన్ ఇందులో ఉయ్యాలవాడకు గురువుగా కనిపిస్తాడని, ఈ పాత్ర చాలా వీరోచితంగా ఉంటుందని, ఇక ఐశ్వర్యారాయ్ అయితే ఎగిరి గంతేసి హీరోయిన్‌గా ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇక తొలితరం బ్రిటిష్‌వారిని ఎదిరించిన స్వాతంత్య్ర యోధునిగా ఉయ్యాలవాడకు జాతీయ గుర్తింపును మోదీ సర్కార్ ఇవ్వనుందని హైప్ చేసే పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నది మోదీ అని, సోనియా కాదని ఆ పుకారు రాయుళ్లకు తెలియకపోవచ్చు. మొత్తం మీద అందరూ నిద్రలో కూడా 'బాహుబలి' జపం చేస్తున్నారు.