పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా.. అన్నట్లుగా నిర్మాతలందు అల్లు అరవిందే వేరయ్యా అని చెప్పాలి. ఈ నిర్మాత నీతులు చెప్పమంటే బహు చక్కగా, వినసొంపగా చెబుతాడు. ఇక తన విషయానికి వస్తే అన్నీ అడ్డమైన వాదనలే. ఇక తెలుగులోనే కాదు.. ఏ భాషలోనైనా ఫ్రీమేక్‌లు ఎంతో కామన్. అసలు ఏ కథ అయినా గతంలో తీసిన ఏదో ఒక చిత్రం నుంచి స్ఫూర్తిగా పొంది.. వాటి ప్రభావంతో కొత్త కథలను రాసుకుంటూ ఉంటారు.
ఒకే కథను ఒక్కో క్యారెక్టర్ యాంగిల్‌లోంచి చూసి, కొత్త కథ అనే కలరింగ్ ఇస్తుంటారు. ఇక సాంకేతిక పెరిగిన ఈ రోజుల్లో ఏ కొరియన్ చిత్రాన్నో, చైనీస్ చిత్రాన్నో వాడుకుంటారు. స్వాతి, విపుల, చతుర వంటి పుస్తకాలలో వచ్చే కథలు, క్యారెక్టర్లను బేస్ చేసుకుంటారు. మహాభారతంలోని ఎపిసోడ్స్‌నో, రామాయణంలోని స్పూర్తినో పొందుతుంటారు. ఒకే ఒక్క 'గాడ్‌ఫాదర్' అనే పాయింట్‌ని తీసుకొని వందల చిత్రాలు తీశారు.
ఇక అల్లుగారి విషయానికి వస్తే ఆయన నిర్మించిన అనేక చిత్రాలలోని కథలు, క్యారెక్టర్లు కూడా ఎక్కడో చూసిన తలంపులు తెచ్చేవే అని చెప్పడం తప్పుకాదు. ఇక తన 'మగధీర' చిత్రాన్ని తీసుకుని బాలీవుడ్‌లో 'రాబ్తా' అనే చిత్రం రూపొందిందని అల్లు వారు కోర్టు మెట్టెక్కారు. కాగా తాను 1998లో రాసిన 'చందేరి' అనే నవలను కాపీ కొట్టి 'మగధీర' తీశారని రచయిత ఎస్.పి.చారి అంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఆర్చారాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు మరణించి 400ఏళ్ల తర్వాత మరలా జన్మించి ఎలా ఒకటయ్యారు అనేది తన నవల మెయిన్ పాయింట్ అని ఆయన చెబుతున్నాడు. నా నవలలో మెయిన్ విలన్ హీరో సోదరుడు అయితే 'మగధీర'లో హీరోయిన్‌కి బావగా చూపించారట.
గీతా ఆర్ట్స్‌కి వ్యతిరేకంగా తాను ఫిల్మ్ చాంబర్‌కి వెళ్లినా తనను పట్టించుకోలేదని, ఈ కథ విషయంలో తాను కాపీ రైట్స్ యాక్ట్ కింద కోర్టుకి వెళ్తానంటున్నాడు. ఇక 'మగధీర'ను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో తీయాలని సాజిద్ నదియావాలా భావించి, అడ్వాన్స్ కూడా ఇచ్చాడని కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇక 'మగధీర'లోని ఓ లిరిక్‌పై వంగపండు కూడా ఆక్షేపణ తెలిపిన విషయం తెలిసిందే.
ఇక ఈ కథను రాసింది విజయేంద్రప్రసాద్. ఈయన గారు కూడ ఎప్పుడో వచ్చిన 'పసివాడి ప్రాణం' కథను స్ఫూర్తిగా తీసుకొని 'భజరంగీ భాయిజాన్' కథను రాశాడు. మరి ఇప్పుడు 'మగధీర' విషయంలో 'రాబ్తా'ను నిందించడం, కోర్టు వరకు వెళ్లడం అల్లువారికి సరిపడదనే విమర్శలు వినిపిస్తున్నాయి.