తాజాగా ఓ వ్యక్తి ఫేస్ బుక్‌లో వెలిబుచ్చిన ఆవేదన నిజంగా అర్దం చేసుకోదగింది. 'భారత్ మాతాకీ జై, గోమాతను పూజించండి, కాశ్మీర్ నుండి పాకిస్థానీలను వెళ్లగొట్టండి.. వందేమాతరం, భారతదేశం వేదభూమి' ఇలాంటి మాటలను ఎవరైనా అన్నారంటే వెంటనే ఎదుటి వారి నుండి వచ్చే ప్రశ్న నువ్వు బిజెపినా, ఆర్‌ఎస్‌ఎస్ సానుభూతిపరుడివా? అని మాత్రమే. ఎంత దౌర్బాగ్యం.. ఈ భావాలున్నంత మాత్రాన అతను కరడుగట్టిన హిందువు అయిపోతాడా? మన దేశంలో వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, కులాలు, వర్ణాలు, భాషలు ఉన్నటు వంటి చోట ఒకరి మనోభావాలను మరోకరు గౌరవిస్తేనే ప్రజల మద్య ఐక్యత, అనుబంధం పెరుగుతాయి.
ఇక ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా గోవధ చట్టాన్ని కఠినతరం చేస్తోంది. కానీ దీనిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. దేశంలోని మెజార్టీ పౌరులైన హిందువులు దైవంగా భావించే గోమాతను చంపి తినడం చాలా తప్పు. ముస్లింలకు పందులంటే పడదు. కాబట్టి ఎంతో మంది హిందువులు కూడా పంది మాంసాన్ని వద్దనుకుంటారు. ఇక కొందరు కుహనా లౌకిక వాదులైతే గోవధపై విధించిన నిషేధం ప్రజాస్వామ్యానికి పెద్ద చెంపపెట్టు అంటున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా బహిరంగ వీధుల్లో గోమాతలను కట్టివేసి, నరికి, చంపి, వండుకుని తిని, కేంద్రానికి తమ వ్యతిరేకతను చాటాలని చూస్తున్నారు.
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడంలో అర్దం ఉంది కానీ దాని కోసం నడిరోడ్డు మీద ఆవులను అందరూ చూస్తుండగా నరికివేయాలా? ఇదేం వ్యతిరేకత? మరికొందరైతే చవకగా లభించే గోమాంసం దొరకనందు వల్ల దళిత, బడుగు, బలహీన వర్గాల వారు తమ ఆహారంలో వాటిని తినలేకపోతున్నారని, ఆవు మాంసం తింటే ఐక్యూ వస్తుందని వాదిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం కేవలం గోవుల మీదనే చర్య తీసుకోలేదు. వ్యవసాయ, పాడి పరిశ్రమలకు జీవితాంతం కాస్త గడ్డి పెట్టి, కుడితి పెట్టి.. పాలు పిండుకొని అమ్ముకొని, వాటి మీద, ఆ సంపాదనతో బతికి, వ్యవసాయానికి పశువులను వాడుకొని, అవి పాపం.. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు వాటిని కొద్ది ధర కోసం కబేళాలకు అమ్మే ఒంటెలపై, గోవులపై, పశువులపై కూడా నిషేధం విధించింది.
దీనిని వ్యతిరేకించమంటే కని, పాలు పట్టి, రక్తం పంచి, కష్టపడి పెద్ద చేసిన తల్లిని, తండ్రిని అమానవీయంగా ముసలితనంలో చూడాల్సివస్తుందని హత్య చేసిన దానితో సమానం. మానవులకైతే నోరు ఉంది. మరి మూగజీవాలు ఏమని తమ బాధను చెప్పుకోగలవు? అందుకే దాసరిగారు తన 'అమ్మరాజీనామా' చిత్రంలో తానే ఓ అద్భుతమైన పాట రాశారు. కావాలంటే విని అర్ధం చేసుకొని, కవి హృదయాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేయాలి..!