జూన్ 2వ తేదీ.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తీరిన రోజు... స్వంతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చీకటిరోజని మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎంతో సంతోషంగా సమన్యాయంతో విభజించి, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేసేలా చూడాలని తాను నాడు కేంద్రాన్ని బతిమిలాడానని బాబు చెప్పుకొచ్చారు. లోటుబడ్జెట్‌తో, రాజధాని కూడా లేకుండా తమను ఒంటి గుడ్డలతో ఏపీకి పంపేశారని ఆయన మరోసారి కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్ది కోసం, ప్రజల మనస్సులో ఏముందో తెలుసుకోకుండా, పెద్దన్న పాత్ర పోషించకుండా వార్ రూమ్ నుంచి ఆదేశాలను జారీ చేశారని, విభజన పత్రాలను గంటకు ఒకసారి వచ్చే సామాన్య విమానంలో పంపకుండా ఏకంగా యుద్దవిమానంలో పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు విభజన జరిగే రోజు తాను కూడా ఢిల్లీలోనే ఉన్నానని, పార్లమెంట్ తలుపులు మూసి మరీ రాష్ట్రాన్ని విడదీశారని, ఈ విషయం తాను బిజెపి సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీకి కూడా చెప్పానని, కేంద్రం చేస్తోంది చాలా తప్పని అద్వానీ సైతం ఒప్పుకున్నారని బాబు నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి రాష్ట్రానికి, దేశానికి ఆవిర్భావ దినోత్సవం రోజు ఉంటుందని, కానీ ఏపీకి అది లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు మద్రాసులో కలిసి ఉన్నామని, కలిసికట్టుగా మద్రాసును అభివృద్ది చేశామని, తర్వాత శ్రీపొట్టిశ్రీరాములు దయతో ప్రత్యేక ఆంద్రప్రదేశ్ ఏర్పడిందని, అప్పుడు కూడా కట్టుబట్టలతో కర్నూల్‌కి వచ్చామని, మరలా హైదరాబాద్ వెళ్లామని, హైదరాబాద్‌ను అభివృద్ది చేసిన తర్వాత మనల్ని తరిమి వేశారని, కేవలం తాను బస్సునే ఆఫీసుగా చేసుకుని పాలన సాగించానని తెలిపారు. తనకు అమరావతి, పోలవరం రెండుకళ్లని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీని దేశంలోనే ముఖ్యరాష్ట్రంగా చేసి చూపిస్తానని, ఇతరులు మనల్ని చూసి కుళ్లుకునేలా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. నాడు దుర్భుద్దితో రాష్ట్రాన్ని విభజించిన వారికి ఇక ఎప్పుడు ఏపీలో స్థానం లేదని ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అందరూ నవనిర్మాణ దీక్షలో పాల్గొనాలని తెలిపారు.మరోవైపు ప్రతిపక్ష వైసీపీకి చెందిన రోజా మాట్లాడుతూ, ఇది చంద్రబాబు దొంగనాటకాల రోజని, ఇది నవనిర్మాణ దీక్ష కాదని, నారా వారి నయవంచక దీక్షని ఆమె ఎద్దేవా చేశారు. అవినీతి లేని రాష్ట్రం అని బాబు చెబుతున్నాడని, అదే విషయాన్ని బాబు కాణిపాకంలోని వినాయకస్వామి మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని ఆమె ప్రశ్నించారు. మొత్తానికి తెలంగాణ విడిపోయి తెలంగాణ సోదరులకు సొంతరాష్ట్రం రావడం ఆనందించకదగ్గ విషయమే అయినా ఏపీకి జరిగిన అన్యాయాన్ని మాత్రం మూడేళ్లైనా ఏపీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు.