తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామి తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. తాజాగా మంత్రి రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ, రాష్ట్రంలో అమ్ముతున్న ప్రైవేట్ సంస్థల పాలలో ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు రసాయనాలు వాడుతున్నారని, ఆ పాలను సేవించడం వల్ల పిల్లలతో పాటు పెద్దలకు ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పని ప్రకటన చేశాడు. దానికి తన వద్ద ఎన్నో ఆధారాలున్నాయని ఆయన సవాల్ విసిరారు.
దీనికి ప్రతిపక్షనేత స్టాలిన్, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయ్‌కాంత్‌లు ప్రైవేట్ పాల సంస్థలు మీకు లంచాలు ఇవ్వడం లేదని ఇలా ఆరోపిస్తారా? అని ప్రశ్నిస్తుంటే... ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం మంత్రి రాజేంద్ర బాలాజీ తేనెతుట్టెను కదిపాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్న సంగతి తనకు కూడా తెలుసునని, కానీ దానిని బహిరంగంగా చెబితే తమ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన మంత్రికి హితబోధ చేశారు.
తమిళనాడులో ఎక్కువ ప్రైవేట్ పాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సంబంధించిన హెరిటేజ్ నుంచే వస్తున్నాయని, ఈ ఆరోపణల వల్ల బాబుకు కోపం వస్తే తమ సర్కార్ పడిపోతుందని పళనిస్వామి ఆందోళన చెందుతున్నారు. ఎన్డీయేలో చంద్రబాబు భాగస్వామేకాక ఎంతో పలుకుబడి ఉన్న నాయకుడని, ఆయన మోదీకి ఈ విషయంలో ఫిర్యాదు చేస్తే కేంద్రానికి తాము టార్గెట్ అవుతున్నామని, తమ పార్టీ నుంచి 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను బయటకు పంపగల సత్తా బాబుకు ఉందని పళని స్వామి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
తాజాగా హెరిటేజ్ పాలలో ఎలాంటి రసాయనాలు లేవని, తమ కొడుకు, చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా హెరిటేజ్ పాలనే తాగుతాడని బాలకృష్ణ కుమార్తె, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి స్పష్టం చేసింది. మొత్తానికి పాలకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా తమిళనాడు ప్రజలలో హెరిటేజ్ పాలపై పెద్ద చర్చే నడుస్తుండటం విశేషం.