తాజాగా నిన్న ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తాము పవన్‌ని తప్పుపట్టడంలేదని,ఆయన వ్యక్తిత్వాన్ని, నిజాయితీని తాము శంకించడం లేదని తెలుపుతూ పవన్‌పై ఒక్కమాట కూడా అనవద్దని తన పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుపుతూ. పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కానీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం టిడిపి, బిజెపిలు పవన్‌ని ఎలా ఒప్పించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి.
తాజాగా జరిగిన ఓ పరిణామం టిడిపి, బిజెపికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు చేసింది. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గుంటూరులో 'ప్రత్యేక హోదా భరోసా' సభను నిర్వహించ తలపెట్టింది. ఈ సభకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను, వైసీపీ అద్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌లను కూడా ఆహ్వానించింది. ఈ సభకు తాము ఇద్దరం హాజరవుతామని వారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సభ నిర్వాహకులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పైశాచికంగా విభజించింది. దీంతో ఏపీ ప్రజల ఆగ్రహానికి గురైంది తద్వారా 2014 ఎన్నికల్లో ఏపీ మొత్తం నుంచి ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎన్నికకాలేదు.
సరికదా...! అనేక మంది డిపాజిట్లను సైతం కోల్పోయారు. ఇక ఏపీని విభజించిన తామే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ద్వారా హామీ ఇచ్చామని, కానీ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపిలు ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ చాలని మోసం చేశారని కాంగ్రెస్ ప్రజలకు వివరించదలుచుకుంది. అందుకే ప్రత్యేకహోదా నినాదాన్ని జనసేన, వైసీపీలతో సహా తమ భుజానికి ఎత్తుకుంది. ఇక 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఏపీకి లోటు బడ్జెట్ నుంచి అన్ని విషయాలలో డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతో జనసేన అధినేత పవన్ మోదీ, చంద్రబాబులతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రత్యేకహోదా ఇస్తామంటున్న మోదీకి, రాష్ట్రాన్ని తన అనుభవంతో ముందుకు తీసుకుని పోగల చంద్రబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో టిడిపి గెలవడంలో ఇది చాలా కీలకమైనదని చంద్రబాబుకు సైతం తెలుసు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదానే ఎందుకు కావాలి? దాని వల్ల కలిగే ప్రయోజానాలు ఏమిటి? ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా? వంటి విషయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించుకుంది. మొత్తానికి రాష్ట్రంలో మరలా కాస్త బలం పుంజుకునేందుకు కాంగ్రెస్ చర్యలు ప్రారంభించిందనే చెప్పాలి. ఇక ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు, కేంద్రంలోని కీలక వ్యక్తులే కాక పలువురు రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతారు. మరి చిరంజీవి ఈ సభకు వస్తాడో లేదో అనే ఆసక్తి కూడా అందరిలో ఉందనే చెప్పాలి.