సినిమాను ఎంత భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించినా, భారీ లోకేషన్లు, అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలన్నా, ఒకే హీరోని ఒక్కో చిత్రంలో ఒక్కో టైప్‌లో స్క్రీన్‌పై డిఫరెంట్ కలర్స్, షేడ్స్‌లో వైవిధ్యంగా చూపాలన్నా కూడా అది దర్శకుని తర్వాత సినిమాటోగ్రాఫర్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే సినిమాకు మొదటి జడ్జి సినిమాటోగ్రాఫర్ కాగా, రెండో జడ్జి, మూడో జడ్జ్‌లు దర్శకుడు, ఎడిటర్లు అని చెబుతుంటారు.
ఇక ఆమధ్యకాలంలో మన స్టార్స్, దర్శకులు తమ జీవితాంతం తమకు కలిసొచ్చిన, తమకు ట్యూనింగ్ అయిన సినిమాటోగ్రాఫర్స్‌నే మరలా మరలా పెట్టుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు మన స్టార్స్ కూడా సాంకేతికత విషయంలో కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ సంగీత దర్శకుల నుంచి సినిమాటోగ్రాఫర్ల వరకు ఒక్కో చిత్రానికి ఒక్కొక్కరిని తీసుకుంటూ ప్రత్యేకతను చాటుతున్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. మహేష్ విషయానికి వస్తే ఆయన మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' చిత్రం చేస్తున్నాడు.
దీనికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక ఆయన కిందటి చిత్రం 'బ్రహ్మూెత్సవం'కు రత్నవేలు పనిచేశాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా త్వరలో ప్రారంభించనున్న 'భరత్ అనే నేను' చిత్రానికి ప్రముఖ బాలీవుడ్, కోలీవుడ్ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్‌తో పనిచేయనున్నాడు. ఈ విధంగా విజువల్స్‌లో చేంజ్ కోసం సినిమాటోగ్రాఫర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
మరోవైపు స్టైలిష్‌స్టార్ బన్నీ కూడా ఈ విషయంలో మహేష్‌తో పోటీపడుతున్నాడు. 'సరైనోడు'కు రిషి పంజాబీని ఎంచుకున్నాడు. అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'డిజె' (దువ్వాడ జగన్నాథం) చేస్తున్నాడు. జూన్ 23న విడుదల కానున్న ఈ చిత్రానికి అయాంకాబోస్‌ను తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన విజువల్స్, టీజర్‌లలో బన్నీని అతను చాలా అద్భుతంగా చూపించాడని అర్దమవుతోంది. మొత్తానికి మార్పు మంచి కోరకే అని చెప్పవచ్చు.