వేదభూమి భారతావనిలో పుట్టిన మహాభారతం గొప్పదనం... దానిలోని సారాంశం మనకు పెద్దగా తెలియదు కానీ విదేశీయులు మాత్రం దానిలోని సారాన్ని గ్రహించి వాటిని నిజ జీవితంలో అమలు చేస్తూ ఒక వ్యక్తిత్వ, రాజకీయ ప్రామాణిక గ్రంథంగా దాన్ని ఆరాదిస్తున్నారు. ఇక మహాభారతం ఇప్పటికే దూరదర్శన్‌లో వచ్చింది. ఇక దీనిని తీయాలని రాజమౌళి నుంచి దాసరి వరకు అందరూ భావించారు.
అది ఒక మహా సముద్రం. ఎవరికితోచిన విధంగా, ఎవరి తరహాలో వారు ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది దానిలో ఎంతో ఉంటుంది. అందుకే జక్కన్న సైతం మహాభారతం ఓ మహాసముద్రమని ఎవరు దానిని సినిమాగా తీసినా అందులోని ఓ నీటి బిందువును మాత్రమే చెప్పగలరని, ఎవరు ఎన్ని చెంబుడు నీళ్లు తీసుకున్నా అది ఇంకిపోదని గొప్పగా చెప్పారు. ఇక అరబ్‌దేశాలలోని మోహన్‌లాల్ మిత్రుడైన ఓ ఎన్నారై ఏకంగా 1000కోట్ల బడ్జెట్‌తో మహాభారతాన్ని అనేక భాషల్లో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. 'రాండామూజం' నవల ఆధారంగా శ్రీకుమార్ దర్శకత్వంలో భీముని కోణంలో సాగే ఈ మహాభారతంలో భీముని పాత్రను మోహన్‌లాల్, భీష్ముని పాత్రను అమితాబ్, కర్ణుడి పాత్రను నాగార్జున, అర్జునుడి పాత్రను విక్రమ్, దౌపద్రి పాత్రను ఐశ్వర్యారాయ్‌లు పోషించనున్నారని సమాచారం.
ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు చాలా మంది ఇది 'బాహుబలి'కి చెక్ చెప్పే ఓ గాసిప్‌గానే భావించారు. సినిమా పట్టాలెక్కితే చూద్దాంలే అని భావించారు. కాగా ఈ చిత్రం షెడ్యూల్స్‌ని కూడా ఇప్పుడు ఫైనలైజ్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్‌ను అబుదాబిలో చేయనున్నారు. మహాభారతంలో కీలకమైనది కురుక్షేత్ర సంగ్రామం. దాంతో ఈ కురుక్షేత్రాన్ని అబుదాబిలోని ఎడారి లోకేషన్లలో ముందుగా చిత్రీకరిస్తారట. ఇక దీనికి గ్రాఫిక్స్‌ను జోడించే పనిని సాంకేతిక నిపుణులకు వదిలేసి, మిగిలిన షూటింగ్‌ను పలు ప్రాంతాలలో చిత్రీకరించాలని నిర్మాత, దర్శకులు డిసైడ్ అయ్యారు. కాగా దీనిని రెండు భాగాలుగా చిత్రీకరిస్తారని సమాచారం.