నేడు సోషల్ మీడియా నుంచి ప్రతి చోటా కులాల గొడవలు మిన్నంటుతున్నాయి. చదువులేని వారికంటే బాగా చదువున్న వారే సోషల్ మీడియాలో కూడా కులం గురించి చేసే వ్యాఖ్యానాలు వింటే బాధకలగక మానదు. పవన్ బాగా చేశాడంటే.. నువ్వు కాపోడివా? అంటారు. బాలయ్య బాగా చేశాడంటే నువ్వు కమ్మోడివా? అని ప్రశ్నిస్తారు. జగన్ తప్పు చేస్తున్నాడంటే 'ఏం.. రెడ్లంటే నీకు చులకనా? చంద్రబాబు అంటే అంత ఇష్టమా? అంటూ మండిపడుతుంటారు.
ఒకే వ్యక్తిని ఇలా అనేక కులాలకు ప్రతినిధులను చేస్తూ మంచిని మంచి అని, చెడును చెడు అని చెప్పే దానికి కూడా వక్రభాష్యాలు తీస్తున్నారు. ఇక రాజకీయాలలో కులం గురించి ప్రస్తావించటమే అనవసరం. ఇక తాజాగా మే 28వ తేదీన స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హీరో నాని ఓ పోస్ట్ పెట్టాడు. దాంతో ఓ అభిమాని.. నానిగాడు కూడా కమ్మోడేనా? అంటూ మాట్లాడాడు. దాంతో నానికి చిర్రెత్తుకొచ్చింది. నేను మీలా తెలుగువాడినే. ఎన్టీఆరే కాదు.. చిరంజీవి అంటే కూడా ఎనలేని గౌరవం ఉన్న వాడిని. పెద్దలకు గౌరవం ఇచ్చే వాడిని అంటూ షాకింగ్‌గా చీవాట్లు పెట్టాడు.
దీంతో ఓ కులం వారికి కోపం వచ్చి నానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టారు. కానీ మనలో కూడా కులం గురించి పట్టించుకోని నిజమైన మానవ కులం వారు ఉన్నారని నిరూపిస్తూ నానికి సపోర్ట్‌గా ఎందరో నాని వ్యాఖ్యలను సమర్దిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ అభిమాని తన కామెంట్‌ను డిలేట్ చేశాడు. ఇక తాజాగా రాజమౌళి కులం గురించి మాట్లాడుతూ, అభిమానులు పట్టించుకున్నంతగా హీరోలు కులాలను పట్టించుకోరు.
ఇక ప్రభాస్ అయితే తన పేరులోనే రాజు అనే పదాన్ని తీసేశాడు. కాబట్టి 'బాహుబలి' కలెక్షన్లకు, ప్రభాస్ కులానికి పెద్దగా లింక్ లేదంటూ తనదైన మంచి వివరణ ఇచ్చాడు. హీరోలకు లేని కులం గొడవలు, ఈ అభిమానులలో ఇంతగా పాతుకుపోవడం బాధపడాల్సిన విషయం. కనీసం మన భావితరాల కోసమైనా కులం గొడవలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని భావిద్దాం....!