'బాహుబలి-ది బిగినింగ్, 'బాహుబలి- ది కన్‌క్లూజన్'లతో రాజమౌళి ఎక్కడికో వెళ్లిపోయాడు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా మంది సినీ ప్రియులు ఈయన ఎవరా? అని ఆరా తీస్తున్నారు. ఇక 'బాహుబలి' తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏదీ? ఏ హీరోతో? ఏ నిర్మాతలకు? అనేది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనేదాని కన్నా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన బాలీవుడ్‌లో ఓ చిత్రం చేస్తాడని, కాదు.. కాదు రజినీతో ఓ చిత్రం చేస్తాడని, ఇక మహాభారతం తీస్తాడని ఎన్నెన్నో వార్తలు వస్తున్నాయి.
జక్కన్న వాటిని చేయాలని ఉంది అని చెప్పాడే గానీ ఎప్పుడు అదే సినిమా చేయనున్నానని మాత్రం చెప్పలేదు. ఆయన కథను బట్టే హీరోని ఎంచుకుంటానని చెబుతున్నాడు. మరోపక్క ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ నా కుమారుడి కావాల్సి వస్తే గంటలో కథ రాస్తానంటున్నాడు. ఇలా వీరిద్దరు కలిసి సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. తాజాగా కూడా రాజమౌళి మీరు ఎన్టీఆర్‌తో తదుపరి చిత్రం చేస్తారా? అంటే ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నా. అది తదుపరి చిత్రం కావచ్చు...కాకపోవచ్చు.. ఇక నా తండ్రి ఇప్పటికే మూడు కథలు ఇచ్చారు. అవేమీ నా బుర్రకు ఎక్కలేదు. ఇక నాకు దానయ్య, కె.ఎల్.నారాయణలతో కమిట్‌మెంట్‌ఉంది.
ఇక వారాహి అధినేత సాయి కొర్రపాటికి కూడా ఓ చిత్రం చేయాల్సివుందని తేల్చాడు.సో.. ప్రస్తుతం ఆయన సినిమా తెలుగులో చేస్తే పాత కమిట్‌మెంట్స్ కింద ఈ ముగ్గురు మాత్రమే క్యూలో ఉన్నారు. కానీ వీరికి జక్కన్న సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడే గానీ ఇంకా రెమ్యూనరేషన్ చెప్పలేదని, వారి చిత్రాలు ప్రారంభమయ్యే నాటికి తన స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటానని మాత్రమే హామీ ఇచ్చాడని సమాచారం. సో.. వీరు ముగ్గురితో ముగ్గురు హీరోలతో జక్కన్న చిత్రాలు చేసినా ఆయన పారితోషికం, సినిమా బడ్జెట్ మాత్రం కమిట్‌మెంట్ సమయంలోలా ఉండవని, పరిస్థితి ప్రస్తుతం ఎక్కడికో ఎదిగిందని అంటున్నాయి సినీ వర్గాలు.