దగ్గుబాటి రానాపై ఇంతకాలం చాలా కామెంట్స్ వచ్చాయి. ఓ సీనియర్ స్టార్ ఆయనకు బాబాయ్. ఆయన తండ్రి ఓ సుప్రసిద్ద నిర్మాత, ఆయన తాత స్వర్గీయ డాక్టర్ రామానాయుడు సినీ లెజెండ్. అయినా ఆయనకు హీరో లక్షణాలులేవంటూ అందరూ గోల చేశారు. తనకు నచ్చిన పాత్రని, తనకు విభిన్నం అనిపించిన పాత్రను ఎలాంటి ఇగోలు లేకుండా, ఎంత నిడివి, ఏమిటి? విలనా? హీరోనా? అతిథా? అని ఆలోచించకుండా ఆయన తనదైన పంధాలో వెళ్లుతుండటమే దీనికి కారణం.
ఇక ఆయన కేవలం హీరో అయితే ఎప్పుడో అయిపోయి.. ఇప్పటికే జనాల నెత్తిన రుద్దించుకుని అలవాటు పడిపోయేవాడు. కానీ ఆయన అలా ఆలోచించలేదు. అదే నేడు ప్లస్ అయింది. 'బాహుబలి1' రిలీజ్ సమయంలో తెలుగులో పక్కనపెడితే హిందీలో కరణ్ జోహార్, రానా, తమన్నాలకు మాత్రమే కాస్త ఫాలోయింగ్ ఉంది. ఇక తమిళంలో అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్, నాజర్ వంటి వారే తెలుసు. కానీ ఈ అన్ని భాషల్లో కామన్‌గా, గెస్ట్‌గానైనా తెలిసిన నటుడు రానా మాత్రమే. ఇక ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కొత్త దర్శకుడు సంకల్ప్‌రెడ్డితో ఆయన చేసిన 'ఘాజీ' చిన్నా చితకా ప్రయోగం కాదు.
పాటలు, డ్యాన్స్‌లు, మాస్ ప్రేక్షకులు కోరుకునే ఫైట్స్.. హీరోయిజం వంటివేమీ లేని ప్రయోగాత్మక చిత్రం ఇది. ఇది కూడా రానా స్థాయిని బాగా పెంచింది. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత భళ్లాలదేవ పేరు మారుమోగిపోతోంది. ఇక దర్శకుడు తేజ హిట్టూ అంటేనే మోహం వాచిపోయి ఉన్నాడు. 'జయం' తర్వాత అన్నీ అపజయాలే. చిత్ర విచిత్రాలు, డ్యాష్ డ్యాష్‌లు ఏమీ కలిసి రాలేదు. కాగా ప్రస్తుతం రానా,కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో రానా సోలో హీరోగా 'నేనే రాజు..నేనే మంత్రి' చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రాన్ని స్వయాన సురేష్‌బాబు నిర్మిస్తున్నాడు. హిందీలో డబ్‌కి కరణ్ జోహర్, తమిళం, మలయాళంలో డబ్‌కి కూడా సురేష్ బాబు పుణ్యమా అని పెద్ద సంస్థలే లైన్‌లో ఉన్నాయి. ఈ చిత్రం కూడా మెసేజ్ ఓరియంటెగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుండటం విశేషం. మరి ఈ చిత్రమైనా రానా సోలో హీరో కోరికను తీరుస్తుందో లేదో చూడాల్సివుంది..!