'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం హీట్ కాస్త తగ్గింది. ఇప్పుడు హీరోలు మరలా తమ చిత్రాల రిలీజ్ డేట్స్‌పై గురి పెడుతున్నారు. 'బాహుబలి' ఊపులో కూడా వెరైటీ చిత్రాల హీరోగా, తనకు 'స్వామిరారా'తో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సుధీర్ వర్మతో నిఖిల్ నటించిన చిత్రం 'కేశవ', ఆ తర్వాతి వారం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నాగార్జున తమ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో నిర్మించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి.
వైవిధ్యభరితమైన చిత్రాలను ఆదరించే వారు 'కేశవ'ను, ఫ్యామిలీ ప్రేక్షకులు 'రారండోయ్ వేడుక చూద్దాం'ను బాగా ఆదరిస్తున్నారు. ఇక జూన్ 2న రాజ్ తరుణ్,హబ్బాపేటల్‌లు 'అంధగాడు'గా రానున్నారు. వరుసగా డబుల్ హ్యాట్రిక్ మీద ఉన్న నాని నటించిన 'నిన్నుకోరే' చిత్రం జూన్ 7వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. శివనిర్వాణ అనే నూతన దర్శకునితో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం నానికి కలిసొచ్చిన ప్రమోషనల్ సాంగ్ ద్వారా అదరగొడుతోంది.
నాని రేంజ్‌ను 35కోట్లకు తీసుకెళ్లిన 'నేను లోకల్' తర్వాత నాని నటిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం హిట్టయితే నానికి ఏడో విజయం దక్కి, త్రిబుల్ హ్యాట్రిక్‌కు సిద్దమవుతాడు.ఇక కేరాఫ్ మాస్ అండ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు, ఎవర్‌గ్రీన్ హిట్స్ ఇచ్చి, ఇండస్ట్రీ హిట్స్‌తో స్టార్స్‌కు మరిచిపోలేని బ్లాక్‌బస్టర్‌ని అందించిన దర్శకుడు బి.గోపాల్. ఆయన 'మస్కా' తర్వాత దాదాపు 8ఏళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం 'ఆరడుగుల బుల్లెట్'. 'సౌక్యం' తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని వరుస సినిమాలతో వస్తున్న మాస్ హీరో, తెలుగులో మినిమం యాక్షన్ హీరో అయిన గోపీచంద్‌తో నయనతార జతకట్టిన చిత్రం ఇది.
బి.గోపాల్ చాలా రోజుల తర్వాత చిత్రం చేయనుండటం, గోపీచంద్ ఈ ఏడాది తన మూడు చిత్రాలైన 'ఆరడుగుల బుల్లెట్, గౌతమ్‌నందా, ఆక్సిజన్'లతో రానుండటం, తమిళ నాట ఎవర్‌గ్రీన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం వంటివి ఈ చిత్రం విశేషాలు. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టోరీతో గోపీచంద్ కటౌట్‌కి తగ్గట్లుగా వస్తున్న ఈ 'ఆరడుగుల బుల్లెట్ చిత్రం ఇప్పటికే ట్రైలర్‌లోని డైలాగ్స్‌తో, ప్రకాష్‌రాజ్, తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రం జూన్ 9న విడుదల కానుంది. మొత్తానికి 'డిజె' వచ్చేలోపు ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసి సినీ ప్రియులకు మంచి విందుభోజనాన్ని అందించనుండటం విశేషం.