ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం'లాగా ఉంది కొందరి యవ్వారం. ఆమధ్య ఎప్పుడో ప్రభాస్ పెళ్లి ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త మనవరాలితో జరగనుందని వార్తలు వచ్చాయి. వాటికి బలం చేకూరేలా ప్రభాస్ పెద్దనాన్న రెబెల్‌స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని చెబుతూ ఉండటంతో వీటికి ఊపొచ్చింది. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్' విడుదల కాగానే ప్రభాస్ పెళ్లి అన్నారు.
కానీ ప్రభాస్ మాత్రం రాజకీయాల్లోకి రజినీలా 'దేవుడు శాసించాలి.. యంగ్‌రెబెల్‌స్టార్ పాటించాలి' అనే నినాదం ఎత్తుకున్నాడు. తాజాగా ప్రభాస్, అనుష్కలకు త్వరలో పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఇంకా నయం వీరే వారిద్దరిని కలిపి పెళ్లి చేయలేదు. అంత వరకు సంతోషం. ఇక తాజాగా ప్రభాస్ పెళ్లికి సెప్టెంబర్ లేదా నవంబర్‌లో మంచి ముహూర్తాలున్నాయని, వాటిని సూచించమని కృష్ణంరాజు పురోహితులకు సూచించాడట. దాంతో ప్రభాస్ పెళ్లి పేరుతో పలు తేదీలు స్వైరవిహారం చేస్తూ కొందరైతే ఏకంగా ప్రభాస్ పెళ్లి జాతకాలను వీడియోలు తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు.
ఇవి వైరల్ అవుతున్నాయి. ఇక ఓ జ్యోతిష్య, పురోహితుడు చెబుతూ, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో ప్రధాన మార్పు జరగబోతోందని, వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రభాస్ ఓ ఇంటి వాడు కావడం ఖాయమన తేల్చేశాడు. తాజాగా వినిపిస్తున్న రూమర్ల ప్రకారం ప్రభాస్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీ రాజు మనవరాలిని చేసుకోనున్నాడట. ఇవ్వన్నీ పట్టించుకోని ప్రభాస్ 'బాహుబలి' సక్సెస్‌ను విదేశాలలో ఎంజాయ్ చేస్తూ, ఓకేసారి వేసవి ట్రిప్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. జూన్‌లో ఆయన ఇండియా వచ్చిన వెంటనే సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం షూటింగ్ ఊపందుకుంటుంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాతే ప్రభాస్ పెళ్లి అంటున్నారు.