కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో వారి నేతలు తమను తాము ఏదో ఊహించుకుని మాట్లాడేస్తూ ఉంటారు. అధిష్టానం నిర్ణయాలను కూడా బేఖారత్ చేయరు. అదేమంటే మాది అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నపార్టీ అంటారు. ఇక వైసీపీ అధినేత జగన్ పార్టీని స్థాపించినప్పుడు దానిలోకి పలువురు కాంగ్రెస్ నేతలు ప్రవేశించారు. దాంతో ఈ అంతర్గత ప్రజాస్వామ్యం అనే పురుగు వైసీపీలోకి కూడా ప్రవేశించింది. తాజాగా వైసీపీ నాయకులను, ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి వలసలను చంద్రబాబు ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ఆ జాడ్యం టిడిపి కూడా అంటుకుంది.
ఎన్టీఆర్ హయాంలో గానీ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో గానీ వారి మాటే వేదవాక్కుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించే వారు. కానీ నేడు పార్టీలోని నాయకులపై, కార్యకర్తలపై చంద్రబాబు ఆధిపత్యాన్ని కోల్పోతున్న సంఘటనలు సంభవిస్తున్నాయి. గీత దాట వద్దని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సస్పెండ్ చేస్తానని బాబు చెబుతున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం దానిని లైట్‌గా తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో కరణం బలరాం, గొట్టిపాటి రవి కుమార్‌ల మద్య విభేదాలు, తాజాగా జరిగిన హత్యలు దీనికి పరాకాష్ట. ఇక డొక్కా మాణిక్య వర ప్రసాద్... చంద్రబాబు మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇక మరో ఎంపీ శివ ప్రసాద్‌ది కూడా అదే ధోరణి, చంద్రబాబు మండిపడినా కూడా తాను అదే మాటకు కట్టుబడి ఉన్నానని ఎంపీ కేశినేని నాది అంటున్నాడు. ఇది బిజెపికి ఓ అస్త్రంలా మారింది. ఇక కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి, రామ సుబ్బారెడ్డిల రాద్దాంతం, నంద్యాలలో అఖిలప్రియ, శిల్పామోహన్‌రెడ్డిలు, పశ్చిమగోదావరి ఎమ్మెల్యేలు బాబు ఎంత చెప్పినా కూడా తమ గన్‌మెన్లను కూడా వెనక్కిపంపడం, ఎమ్మెల్యే అనిత వ్యవహారం... ఇలా ఎవ్వరి మీద చంద్రబాబు పట్టు సాదించలేకపోతున్నాడని, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారి వల్ల టిడిపి క్రమశిక్షణ తప్పుతోందని, ఇది రాబోయే రోజుల్లో టిడిపికి పెద్ద తలనొప్పి కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.