వాస్తవానికి సినీ పోషకుల్లో యువత, మహిళలు.. ఇలా చాలా మంది ఉండేవారు. కానీ రాను రాను ఈ ప్రేక్షకుల జోనర్ తగ్గిపోతోంది. మహిళలు బుల్లి తెరపై సీరియళ్ల, తాము చూడాలనుకున్న చిత్రం శాటిలైట్‌లో వస్తే అప్పుడు చూస్తున్నారు. ఇక యువత చేతిలో ఈమధ్య సెల్‌ఫోన్‌లు, దానికి నెట్ కంపల్సరీ అయిపోయాయి.దాంతో వారు ఎంచక్కా ఇంటర్నెట్‌లోంచి కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసి చూసేస్తున్నారు. సినిమా మరీ బాగా నచ్చితేనే థియేటర్లకు వెళ్తున్నారు.
ఇక ఇప్పుడు మెయిన్‌గా ఫ్యామిలీ మొత్తాన్ని థియేటర్ వరకు తీసుకెళ్తున్నది కేవలం చిన్నారులు మాత్రమే. వారు తమకు నచ్చే చిత్రాన్ని ఎలాగైనా వెండితెర మీద చూపించమని తల్లిదండ్రులను ఏడిపించి మరీ తీసుకెళ్తున్నారు. యువత, మహిళా ప్రేక్షకుల లాగా చిన్న పిల్లలు ఒంటరిగా సినిమాలకు వెళ్లరు. వారు థియేటర్‌కు వెళ్లి తమకు నచ్చిన చిత్రాలు చూడాలంటే ఫ్యామిలీ అంతా కదిలిపోవాల్సిందే. ఇక విషయానికి వస్తే మొన్న శుక్రవారం మే 26వ తేదీన క్రికెట్ దేవుడు సచిన్ బయోపిక్ విడుదలైంది.
ఇది ఓ డాక్యూమెంటరీ వంటి చిత్రం. చాలా తక్కువ ఖర్చుతో తెరకెక్కించిన మూవీ. అందునా ప్రభుత్వాలు ఈ చిత్రానికి వినోదపు పన్ను రాయితీలు కూడా ఇచ్చాయి. ఇంకేముంది... తమను కొలిచే చిన్న పిల్లల పుణ్యానైనా ఈ చిత్రాన్ని వేలు ఖర్చు పెట్టి అయినా ఫ్యామిలీలకు ఫ్యామిలీలు తరలి వచ్చి కనకవర్షం కురిపిస్తాయని నిర్మాతలు, బయ్యర్లు భ్రమపడ్డారు.కానీ ఇది 'అజార్, ఎంఎస్ ధోని'లలాగా ఓ చలన చిత్రం కాదని, కాబట్టి పైరసీ చూసినా ఫర్వాలేదనుకున్నారు.
ఎంచక్కా రెండో రోజుకే పైరసీ సీడీతో పాటు ఆన్‌లైన్‌లో కూడా ఈ చిత్రాన్ని పెట్టేశారు. కాస్త చిన్న పిల్లల స్ఫూర్తి కోసమైనా తక్కువ ధరకు ఈ డాక్యుమెంటరీని చూపించే ఏర్పాట్లు చేయకుండా దొరికిందంతా దోచుకో.. అనే ఫార్ములాకు పైరసీ రాయుళ్లు చెక్‌పెట్టారు. పాపం..సచిన్...!