ప్రజలకు మరీ ముఖ్యంగా ఓటర్లకు జ్ఞాపకశక్తి తక్కువ. ఎంత అవినీతి చేసినా, ఎంత ప్రజావ్యతిరేక పాలన చేసినా, ఎంతగా వారసత్వాలను ప్రోత్సహించినా, చిన్న ఆకర్షణీయ పథకం పెడితే చాలు అన్ని మర్చి పోయి గుండెల్లోనే కాదు.. ఇంట్లో కూడా వారి పటాలు పెట్టుకుని దేవుడిలా పూజలు చేశారు. ఇక మన తెలుగు వారికి ఆరంభశూరులనే బిరుదు ఎప్పటి నుంచో ఉంది. దీనిని మనం నిజం కూడా చేస్తున్నాం. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, కోట్లకు కోట్ల, లక్షల కోట్ల అవినీతి చేసినా.. మన విశాలహృదయం క్షమిస్తూనే ఉంటుంది.
మరుపు దేవుడిచ్చిన మహాభాగ్యం అనే నానుడిని నిజం చేస్తూనే ఉన్నాం. ఇక రాష్ట్ర విభజన సమయంలో సమైఖ్యా ఉద్యమం చేశాం. దాన్ని మర్చిపోయి, రాష్ట్రం విడిపోయినా సర్దుకుపోతున్నాం. ఇక ఎలాగూ విడిపోయాం కదా...! కనీసం ప్రత్యేకహోదా అనుకున్నాం. అది కూడా హుష్ కాకి అయిపోయింది. తర్వాత ప్రత్యేక ప్యాకేజీ దాని స్ధానంలో తిష్టవేసింది. ప్రత్యేకహోదా కోసం ఉద్యమం చెలరేగింది. ఇప్పుడు ఆ విషయం ఎవ్వరికీ గుర్తులేదు. మీడియా కూడా అంతే. ఓ నాలుగైదు రోజులు హైలైట్ చేస్తాయి. తర్వాత సదా మామూలే. ఎవరి పనుల్లో వారు, ఎవరి స్వార్థంలో వారు రోజులు గడపడానికి అలవాటు పడుతున్నాం.
అమిత్‌షా రాష్ట్రానికి వచ్చినా ప్రత్యేకహోదా అంశాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎన్నికల్లో పొత్తుల గురించి చంద్రబాబు, మోదీ దయ, కరుణా కటాక్షాల కోసం జగన్ కిమ్మనలేదు. కాంగ్రెస్, వామపక్షాలకు మాత్రం అవి అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. ఇక జనసేనాధిపతి వచ్చే ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేకహోదా, ఉత్తరాది, దక్షిణాది వ్యతాసాలు, రాష్ట్రంలోని చేనేత సమస్యలు, ఉద్దానం బాధితులు.. ఇలా అనేక విషయాలలో ట్వీట్స్ చేస్తున్నా ఒకప్పుడు వచ్చిన స్పందన ఇప్పుడురావడం లేదు. దాంతో ఈ ట్విట్టర్ పులి కూడా ఏదో ప్రశ్నించామంటే.. ప్రశ్నించాం..అన్న విధంగానే తయారయ్యాడు. ఆయన లేవనెత్తే సమస్యలకు, నినాదాలకు ఇప్పుడు ఊపు లేదు.
పాపం.. ప్రజలు కూడా మర్చిపోయారు. ఇక వచ్చేసారి ఎన్నికల్లో వైసీపీ, జనసేన, కాంగ్రెస్ వంటివి రాష్ట్రంలో గెలిచినా, కేంద్రంలో బిజెపినే ఉంటే ప్రత్యేకహోదాను ఎలా సాధిస్తారో చెప్పడం లేదు. వారి వద్ద ఉన్న అస్త్రాలు ఏమిటి? ఎలా ప్రత్యేకహోదా సాధిస్తారు? ప్రణాళికలు ఏమిటి? కేంద్రంపై ఎలా ఒత్తిడి తెస్తారు? అనే వాటిపై ఎవరి వద్ద సమాధానం లేదు. అడిగితే మాత్రం ప్రజల్లో చైతన్యం తెస్తాం.. ఉద్యమాలు చేస్తాం. కేంద్రం మెడలు వంచుతాం.. వంటి పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా... అన్నట్లు సమాధానాలు చెబుతున్నారు.నిబద్దత కనిపించడం లేదు...!