అమిత్‌షా రాకతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో ఇప్పుడు బిజెపి, టీఆర్‌ఎస్‌ల మద్య వైరం బాగా ముదిరింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో పాటు బిజెపిలు కూడా ఒంటరి పోరాటానికి సిద్దమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా మిగిలిన కాంగ్రెస్, టిడిపి, జనసేన, వామపక్షాలు, గద్దర్, కోదండరాం వంటి వారందరూ కలిసి బీహార్‌లోని మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నారు.
నితిష్ కుమార్ తన బద్ద విరోధి అయిన లాలూతో జతకట్టడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి టిడిపి సిద్దంగా ఉందని రేవంత్‌రెడ్డి ప్రకటించడం, మరునాడే టిడిపి అంటరాని పార్టీ కాదని, టిడిపిని కలుపుకు వెళ్తామని కాంగ్రెస్ సీనియన్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. మరోవైపు మాదిగ, రెడ్ది వంటి తెలంగాణలోని కులాలను ఏకంగా చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ఇక దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బిజెపి, మహాకూటమి మధ్య త్రిముఖపోటీ కనిపించే సూచనలున్నాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్ అనుభవ రాహిత్యం, సెల్ఫ్‌గోల్‌లు చేసుకుంటూ ఒంటెద్దు పోకడలు పోవడం వైసీపీకి మైనస్‌గా చెప్పవచ్చు. ఇక ఏపీలో బిజెపికి ఒంటిరిగా పోటీ చేసినా నామ మాత్రమే. ఇక వామపక్షాలు, జనసేన కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి ఏపీలో బహుముఖ పోటీ తప్పదని, హంగ్ అసెంబ్లీ వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావిస్తున్నారు.