తెలుగుదేశం పగ్గాలు స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి తన చేతుల్లోకి తెచ్చుకోవడంలో చంద్రబాబు అత్యంత రాజనీతి ప్రదర్శించాడు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి నందమూరి ఫ్యామిలీలోని అందరినీ తనవైపుకు తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యేలను, ఎంపీలను తనవైపు తిప్పుకున్నాడు. సీఎం పీఠాన్ని అధిరోహించాడు. ఇక ఆ తర్వాత అందరినీ వదిలేశాడు. ఒకానొక సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చిరంజీవిలు బలపడతారేమోనన్న ఉద్దేశ్యంతో సినిగ్లామర్ ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు ధీటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి గాలం వేశాడు.
ఆయన చేత పార్టీకి ప్రచారం కూడా చేయించాడు. కానీ ఆ ఎన్నికల్లో, మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ టిడిపికి ప్రచారం చేసిన చోట్ల టిడిపి గెలవలేదు. దాంతో జూనియర్‌ను దూరంగా పెట్టాడు. ఇక హరికృష్ణను రాజ్యసభకు పంపి ఎంపీని చేశాడు. అప్పట్లో తనపై నందమూరి ఫ్యామిలీలో ఉన్న వ్యతిరేకతను పోగొట్టాడు. ఆ తర్వాత హరికృష్ణకు రెండోసారి ఎంపీ సీటును ఇవ్వడానికి నిరాకరించాడు. జూనియర్‌ని, హరికృష్ణలను దూరంగా పెట్టి వెంటనే లోకేష్‌ని రాజకీయాలలోకి దించడానికి రెడీ అయ్యాడు.
ఎప్పటికైనా నారా కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ నుంచి ముప్పు పొంచే ఉంటుందని భావించి, లోకేష్‌ని బాలయ్య కూతురు బ్రాహ్మణికి ఇచ్చి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న బాలయ్యను వియ్యంకుడిని చేసి తన అల్లుడుని కాదనలేని విధంగా లోకేష్‌ను అడ్డం పెట్టాడు. కిందటి ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని, పవన్ సపోర్ట్ తీసుకున్నాడు. బిజెపికి పవన్ సపోర్ట్ ప్రకటించినప్పటికీ మొదట్లో పవన్ రాష్ట్రంలో ఎవ్వరికీ మద్దతు తెలపలేదు. టిడిపి, వైసీపీలలో దేనికైనా ఓటు వేసుకోండి మీ ఇష్టం అన్నాడు.
ఇక జనసత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్‌కి సపోర్ట్‌గా ఆ నియోజక వర్గంలో జెపికి అనుకూలంగా పవన్ ప్రచారం చేయాలని భావించాడు. కానీ మిత్రధర్మం అది కాదని, బిజెపిని సపోర్ట్ చేసిన పవన్ బిజెపితో పొత్తు ఉన్న టిడిపికి కూడా సపోర్ట్ చేయాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒత్తిడి తెచ్చి, పవన్ ఇమేజ్‌ను బాబు క్యాష్ చేసుకున్నాడు.ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ నిర్ణయం ఏమిటో ఆయనకు ఇంకా తేలలేదు.
దాంతో హరికృష్ణకు ఎన్టీఆర్‌తో సహా ఆయన కుటుంబసభ్యులకు తాజాగా మహానాడుకు ఆహ్వాన పత్రికలు పంపించాడు. లిస్ట్‌లో ఎందరో ఉన్నప్పటికీ ఎంపీ సీటు కంటే టిటిడి అధ్యక్ష పదవిని హరికృష్ణకు ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. పనిలో పనిగా ఎన్టీఆర్‌కు గేలం వేస్తున్నాడు. మరి హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ల నిర్ణయం ఏమిటో తెలియాల్సివుంది...!