రజినీ కాంత్ దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ ఒక స్టేట్మెంట్ పడేశాడు. ఇప్పుడు తమిళనాట ఎక్కడ చూసినా రజినీ రాజకీయ రంగ ప్రవేశం గురించే హాట్ హాట్ టాపిక్ జరుగుతుంది. ఆయన ఆ మధ్యన అభిమానులతో అలా భేటీ అయ్యారో లేదో ఈ రకమైన చర్చలు తమిళనాడులో బాగా మొదలైయ్యాయి. ఇక రజినీ పొలిటికల్ ఎంట్రీ గురించి అభిమానులు ఆశగా ఎదురు చూస్తుంటే మరి కొంత మంది మాత్రం ఆయన రాజకీయ ఎంట్రీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటె రజినీ మాత్రం మళ్లీ సైలెంట్ గా సినిమాల మీద పడిపోయారు. తాజాగా అల్లుడు నిర్మాణంలో రంజిత్ పా డైరెక్షన్ లో 'కాలా' చిత్రం ఫస్ట్ లుక్ ని కూడా లాంచ్ చేసి ఈ నెల 28 నుండి సెట్స్ మీదకి తీసుకెళ్లే పనిలో వున్నాడు.
అయితే కొన్ని తమిళ సంఘాలు రజినీకాంత్ స్థానికుడు కాదని ఆయన తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడం కుదరదని వాదిస్తుంటే.... రజినీ అభిమానులు మాత్రం రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తూ.... తమిళ సంఘాల వాదనని కొట్టిపడేస్తున్నారు. అలాగే తమిళ లెజెండ్రీ డైరెక్టర్ భారతి రాజా కూడా రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి రాకుండా ఉండడమే మంచిదని.... ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటే మంచిదని అంటున్నాడు. మరి ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తుంటే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెరమీదకి వచ్చింది.
కోలీవుడ్ లో రజినీకాంత్ కి ఆప్తమిత్రుడు అయిన కమల హాసన్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కమల్ హాసన్ మీడియా సాక్షిగా తన మిత్రుడు రజినీకాంత్ కు కెమెరాల ముందు కనపడాలని కొంత ఆసక్తి ఎక్కువ అని.... అందుకే ఈ విధంగా రాజకీయాలు ,అభిమానులని హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రజినీ కెమెరాలు ఎక్కడ ఉంటె అక్కడ వాలిపోతారని.... ఇలాంటి పబ్లిసిటీ అంటే ఆయనకి మక్కువని చెప్పి ఆశ్చర్యపరిచారు. మరి అంత మంచి ఫ్రెండ్ రజినీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం మాత్రం ఇప్పుడు కోలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే కమల్ వ్యాఖ్యలపై రజినీకాంత్ స్పందన ఎలా వుండబోతుందో చూద్దాం..!