నిజానికి పూరీ జగన్నాథ్ మహేష్ బాబుతో 'బిజినెస్‌మేన్' చిత్రం చేశాడు. కానీ వాస్తవానికి సినిమా ఫీల్డ్‌లో అల్లు అరవింద్, ఒకప్పటి వర్మ, ఇప్పుడు రాజమౌళిలకు ఈ పేరు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఇక రాజమౌళి బిజినెస్ మాయ అందరికీ తెలిసిందే. ఇప్పటికే 'బాహుబలి1, బాహుబలి2'లతో ఈ చిత్రం ఏకంగా 2500కోట్ల దాకా వసూలు చేసే పనిలో ఉంది. ఇంతలో ఆలస్యంగా మేల్కోన్న అమీర్ తన 'దంగల్'ని చైనాలో విడుదల చేసి 1000కోట్లను టార్గెట్ చేస్తున్నాడు.
కానీ చైనీస్ భాషలో 'బాహుబలి-ది బిగినింగ్' సరైన వసూళ్లు రాబట్టలేదు. చాలా నష్టాలు వచ్చాయి. అయినా సరే 'దంగల్' చైనాలో సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం చూసి చాలా మంది దర్శకనిర్మాతలలాగే రాజమౌళి సైతం తన 'బాహుబలి-ది కన్‌క్లూజన్'ను కూడా చైనీస్ భాషలోకి అనువాదం చేసి 'దంగల్' స్థాయిలో 9వేల స్క్రీన్ల వరకు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడట.
మరోవైపు ఈ చిత్రం త్వరలోనే జపనీస్ భాషలో కూడా అనువాదం అవుతోంది. ఇప్పటి వరకు భారతీయ చిత్రాలన్నీ జపాన్‌లో సబ్‌టైటిల్స్‌తో మాత్రమే విడుదలయ్యాయని, అనువాద చిత్రంగా విడుదలవుతున్న మొట్టమొదటి చిత్రం 'బాహుబలి-ది కన్‌క్లూజన్' అంటున్నారు. ఇక రాజమౌళి అక్కడితో ఆగడం లేదు. ఈ రెండు భాగాల నిడివి దాదాపు 5గంటల 30 నిమిషాల వరకు ఉండటంతో విదేశీ ఎడిటర్లు, సాంకేతిక నిపుణుల సాయంతో ఈ చిత్రాన్ని రెండున్నర గంటలోపు కుదించి ఇంగ్లీష్ వెర్షన్‌ని సైతం విడుదలకు సిద్దం చేస్తున్నాడు.
మరి ఎడిట్‌లో పాటలతో పాటు మరెవ్వరి క్యారెక్టర్లు ఎగిరిపోతాయో వేచిచూడాల్సివుంది..! మొత్తం మీద రాజమౌళి ఫ్యామిలీ ట్రిప్‌లకు వెళ్లినా, తదుపరి చిత్రం కోసం ఆలోచిస్తున్నా కూడా ఆయన మనసంతా ఇంకా 'బాహుబలి' చుట్టూనే తిరుగుతోందని చెప్పాలి.