ప్రస్తుతం తమిళనాట రాజకీయాలు సందిగ్దావస్తలో, తీరుతెన్నూ లేకుండా సాగుతున్నాయి. దీంతో తలైవా రజినీ రాజకీయప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ రజినీ తమిళుడు కాదంటూ కొందరు చేస్తున్న ప్రచారాలను రజినీ అల్లుడు,స్టార్ హీరో ధనుష్ తప్పుపట్టారు. ఇంతకాలం రజినీ ద్వారా సహాయాన్ని పొంది, ఆయనతో మంచిగా ఉంటూ, ఆయనను గౌరవిస్తున్న వారే నేడు తమ రాజకీయ మనుగడ కోసం, రజినీ వస్తే ఇక తమకు భవిష్యత్తులేదని తెలుసుకొని ఆయనపై తమిళేతరుడిగా ముద్రవేస్తున్నారని మండిపడ్డాడు.
రజినీపై ఈ దుష్ప్రచారం మానుకోకపోతే రజినీ అభిమానులే అలాంటి వెధవలకు బుద్ది చెబుతారని, కానీ దీనిని రాజకీయం చేయడం ఇష్టంలేని రజినీనే తన అభిమానులకు, తన మద్దతుదారులకు శాంతంగా ఉండమని ఆదేశిస్తున్నారని దనుష్ తెలిపారు. రజినీకి ఒకప్పుడు తాగుడు, పొగతాగడం వంటి అలవాట్లు ఉండేవనవి అందరికీ తెలిసిన విషయాలే. కానీ రజినీని తాగుబోతుగా సృష్టించడానికి 1979లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రజినీ మద్యం సేవించి కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తించిన విషయాలను రాజకీయ ప్రత్యర్ధులు ఇప్పుడు తెరపైకి తెచ్చి, ఆయన్ను అపఖ్యాతి పాలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రజినీ ఆధ్యాత్మికత వైపు వెళ్లిన తర్వాత తన చెడు అలవాట్లన్నిటికీ దూరంగా ఉంటున్నారు. 1983లో అయితే సినిమాలు, ఇళ్లు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోయరు. కానీ కమల్ హాసన్, బాల చందర్ వంటి వారు ఆయనకు సర్దిచెప్పి మరలా చెన్నై తెచ్చి, సినిమాలలో నటింపజేశారు. ఇక కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, రజినీ వ్యక్తిత్వాన్ని, దానగుణాన్ని ఎంత పొగిడినా తక్కువేనని, ఆయన బిజెపిలోకి వస్తే ఎంతో సంతోషిస్తామని, అంతేకాదు.. ఆయనే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని మరోసారి కుండ బద్దలుకొట్టారు.