రజినీ రాజకీయ సునామి మామూలుగా లేదు. ఆయనను తమిళేతరుడిగా ప్రకటిస్తూ పలు తమిళ చిన్నా చితకా సంఘాలు, సంస్థలు ఆందోళన చేస్తున్నాయి. వీరికి శరత్ కుమార్, భారతీ రాజా వంటి వారు ఆజ్యం పోస్తున్నారు. ఈ తమిళ సంఘాల ఆందోళన వల్ల రజినీ ఇంటి దగ్గర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రజినీ రాజకీయ రంగం ప్రవేశాన్ని కొన్ని చిన్న చిన్న తమిళ సంఘాలు ఆందోళన చేస్తున్నా కూడా పలువురు మెజార్టీ మేధావులు, సమాజ సంఘాలతో పాటు పలు హిందూ సంఘాలు, సంస్థలు రజినీకి అండగా నిలబడ్డాయి.
రజినీపై ఈగవాలిని సహించబోమని, ఆయన ఇళ్లు ఉన్న పోయెస్ గార్డెన్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, దురదృష్టవశాత్తు ఆందోళన కారుల వల్ల రజినీకి ఏమి జరిగినా రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటాయని వారు తమిళనాడు డీజీపికి, చెన్నై నగర కమిషనర్‌కు వినతి పత్రాలు అందిస్తున్నారు. మరోపక్క అమెరికా వంటి దేశాలలోనే ఐదేళ్లు మించి స్థిర నివాసం ఉంటే గ్రీన్ కార్డులంటూ ఇచ్చి వారిని అమెరికన్లుగా గుర్తిస్తారని, కానీ మనదేశస్తుడే అయిన రజినీపై స్థానికేతర ఉద్యమం తెరతీయడం పలు తప్పుడు సంకేతాలను ప్రజలకు పంపిస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
రజనీ రాజకీయాలలోకి రావడం ఇప్పుడు తప్పనిసరి అని, దిశానిర్దేశం లేని ప్రజలు రజినీ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని వారు వాదిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు తమిళనాడుకు రజినీ సునామి పట్టుకుంది.