తెలుగు సినీ ఫీల్డ్‌లో స్టార్ హీరోలు చెప్పిందే వేదం. వారి ప్రకారమే దర్శకులు, రచయితలు, డైలాగ్ రైటర్స్, లిరికల్ రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వినాల్సిందే. స్టార్సే తమ చిత్రాలకు నియంతలు. ఇక్కడ దర్శకులను, చివరకు నిర్మాతలకు కూడా అభిరుచి ఉండకూడదు. తమ చిత్రం ఇలా ఉండాలని పెట్టుబడి పెట్టే నిర్మాత, సినిమాను విజువలైజ్ చేసే దర్శకులకు ఆ పనిలో అడుగడుగునా ఆటంకాలే. ఈ బాసిజాన్ని మణిశర్మ తాజాగా బద్దలు కొట్టాడు.
తనకు అవకాశాలు తగ్గడానికి కేవలం స్టార్సే కారణం. ఆయన ఇచ్చే ట్యూన్స్‌ని స్టార్స్ అభీష్టం ప్రకారం చేయడం వల్లే రేసులో ఆయన వెనుకబడ్డాడు. కానీ తప్పు మాత్రం అందరికీ మణిశర్మదే కనిపిస్తోంది. దాంతో ఆయన తాజాగా రగిలిపోయాడు. ప్రస్తుతం ఆయన చిన్న చిత్రాలైన 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్', 'అమీతుమీ' చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ, నేడు తెలుగులో సంగీత ప్రేమికులు, సినీ సంగీత అభిరుచిగల వారికి తగ్గ ఆహ్లాదకరమైన పాటలు రాకపోవడానికి స్టార్సే కారణమన్నాడు.
కొందరు హీరోలకు మాస్ పాటలు కావాలి. మరి కొందరికి వారి స్టెప్‌లకు అనుగుణమైన ట్యూన్స్ కావాలి. సమయ సందర్భాలు, సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు రాకపోవడానికి వారే కారణమన్నాడు. నిజానికి ప్రభాస్ జోక్యం చేసుకోకపోవడం వల్లే సంగీత పరంగా, విజువల్ పరంగా 'బాహుబలి' చిత్రం అంత పెద్ద హిట్టయిందనేది వాస్తవం. కోలీవుడ్, బాలీవుడ్‌లతో పోలిస్తే తెలుగు స్టార్స్ వైఖరి ఒంటెద్దుపోకడలా ఉంది. ఇక తాను సంగీతం అందించిన 'శక్తి, ఖలేజా, తీన్‌మార్' వంటి చిత్రాలకు మంచి సంగీతం అందించలేకపోయానని చెప్పిన మణిశర్మ దాదాపుగా ఎన్టీఆర్, మహేష్, పవన్‌ల తీరును కాస్త ఘాటుగానే విమర్శించాడని అర్ధమవుతోంది.