నాగ చైతన్య - రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే వుంది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ, నాగార్జున నిర్మాణ సారధ్యంలో తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం ఒక సమస్యలో చిక్కుకుంది. రారండోయ్ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు ఆడవారిపై చేసిన వ్యాఖ్యలవల్ల ఆ చిత్ర నిర్మాత నాగార్జున చిక్కుల్లో పడ్డాడు. చలపతి రావు వ్యాఖ్యలకుగాను కేసులు నమోదుకావడమే కాకుండా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మండి పడుతున్నాయి. ఇక నాగార్జున అయితే చలపతి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఖండించాడు. హీరోయిన్ రకుల్ కూడా అయన వయసులో పెద్దవాడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం కరెక్ట్ కాదని చెబుతుంది.
ఇక నాగ చైతన్య కూడా మేము ఆయన వ్యాఖ్యలు సమర్ధించడం లేదు ఆయన అలా మాట్లాడం తప్పని అంటున్నాడు. అయినా కూడా సోషల్ మీడియాలో చలపతి వ్యాఖ్యలపై దుమారం ఆగలేదు. దీనితో దిగొచ్చిన చలపతి రావు మీడియా సాక్షిగా రాత పూర్వకంగా మహిళా సంఘాలకు క్షమాపణలు చెప్పేశాడు. ఈ వివాదానికి కారణమైన రారండోయ్ చిత్రంలోని 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' అనే డైలాగ్ ని హైలెట్ చేసి రారండోయ్ ఆడియో వేడుకలో యాంకర్స్ దానికి సంబందించిన ప్రశ్నలను అడగగా దానికి చలపతి గారు 'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారని' వెటకారంగా మాట్లాడాడు. మరి ఇంత వివాదానికి దారి తీసిన 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' అనే డైలాగ్ ని ఇప్పుడు 'రారండోయ్ వేడుక చూద్దాం' లో ఉంచాలా తీసెయ్యాలా అనే డైలమాలో చిత్ర యూనిట్ ఉందట.
అయితే ఆ డైలాగ్ తియ్యాలా ఉంచాలా అనేది మాత్రం నాగార్జున నిర్ణయం మీదే ఆధార పడిఉందట. మరి సెన్సార్ కూడా పూర్తి చేసుకుని ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగ్ ఉంటుందో లేదో మరో 48 గంటల్లో తెలిసిపోతుంది. ఇకపోతే చలపతి వ్యవహారం మాత్రం రారండోయ్ చిత్రానికి బాగా పబ్లిసిటీగా పనికొచ్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.