పాకిస్థాన్ వారు భారత గూఢచారి నేపంతో కులభూషన్ జాదవ్‌ని అరెస్ట్ చేసి, ఉరిశిక్ష విధించడం అందరికీ తెలిసిందే. కానీ భారత్ మాత్రం అతను గూఢచారి కాదని వాదించింది. చివరకు గత్యంతరం లేక అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్ ఈ సమస్యను నివేదించి, తమకు న్యాయం చేయాలని కోరింది. అంతర్జాతీయ న్యాయస్థానం కూడా భారత్‌కి అనుకూలంగా తీర్పు చెప్పి, జాదవ్‌ని ఉరిశిక్ష తీయకూడదని ఆదేశించింది.
దీనిపై తాజాగా మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని చెప్పకతప్పదు. నేడు కులభూషన్ జాదవ్ కోసం భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇకపై పాకిస్థాన్ కూడా అదే పని చేస్తూ భారత్‌ని చిక్కుల్లో పెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. వాస్తవానికి మోదీ విధానాలు, ఆయనకు లభించిన మెజార్టీతో భారత విదేశాంగ విధానంలో బలమైన మార్పులు వస్తాయని మేధావులు భావించారు.
కానీ భారత్ మాత్రం జాదవ్ విషయంలో పాక్‌ని నిలువరించి, అంతర్జాతీయంగా తన విదేశాంగ విధానంతో పాక్ చర్యను ఎండగట్టి ఉంటే బాగుండేది. దీని ద్వారా పాకిస్తాన్‌పై అన్ని దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చేంది. కానీ భారత్ ఆ పని చేయకుండా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లింది. గతంలో ఇందిరా నుంచి వాజ్‌పేయ్, పివి నరసింహారావు వరకు తమకు పూర్తి మెజార్టీలేని సమయంలో కూడా భారత్‌ను బలంగా నిలిపారు.
కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని అమెరికా, చైనాలతో పాటు పలు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పినప్పటికీ కాశ్మీర్ అంశాన్ని భారత్, పాక్‌లే తేల్చుకోవాలని, మూడో దేశం గానీ అంతర్జాతీయ సంస్థలు కూడా దీనిలో జోక్యం చేసుకోవడానికి వీలులేదని భారత్ బలమైన వాదన వినిపించింది. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా తప్పు చేసిందనే చెప్పాలి.