క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే అందరికీ ఇష్టం. కొందరికి దైవం. క్రికెట్‌కు దేవుడు. కానీ ఆయన నిజ జీవితంలో మాత్రం ఆయనపై ఎన్నో విమర్శలున్నాయి. కోట్లు సంపాదించినా కూడా విదేశంలో తనకు బహూకరించిన కారుకు దిగుమతి సుంకం తగ్గించాలని ఆయన ఆనాడు కోరడం వివాదమైంది. ఆ మాత్రం కట్టుకోలేడా? అనే విమర్శలు వచ్చాయి. బాల్‌థాకరే నుంచి ఎందరో సచిన్ వ్యక్తిగత వ్యవహారశైలిని తప్పుపట్టారు. ఏదైనా చారిటీ చేయమని అడిగితే ఏదో బ్యాట్ మీద తాను సంతకం చేసి ఇస్తానని, దానిని వేలం వేసుకోమని చెబుతాడే కానీ పదిపైసలు కూడా ఖర్చుపెట్టడనే వాదన ఉంది.
ఇక ఆయన నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. పేరుకు దత్తత అనే పెద్ద పదం వాడినా, ఆ గ్రామంలో ఆయన చేసిన కార్యక్రమాలు ఏమీ లేవు. ఇక ప్రస్తుతం సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా 'సచిన్- ఎ బిలియన్‌డ్రీమ్స్' అనే చిత్రం రూపొందింది. మే 26న విడుదలకు సిద్దమవుతోంది. గతంలో అజారుద్దీన్, ఎం.ఎస్.ధోని వంటి క్రికెటర్ల జీవితాలను తెరకెక్కించారు. దానికి గాను నిర్మాతలు అజార్ ధోనిలకు కొంత రెమ్యూనరేషన్ ఇచ్చారు.
ఇక వేరే హీరోలతో ఆయా పాత్రలను చేయించి సినిమాలను భారీగా తెరకెక్కించారు. కానీ సచిన్ మాత్రం తన బయోపిక్‌కి లాభాలలో సగం వాటా తీసుకున్నాడట. ఇక ఇది ఓ చిత్రంగా కాకుండా ఓ డాక్యుమెంటరీగా రూపొందింది. సచిన్ నేటి జీవితం, నాడు సచిన్ ఆడిన మ్యాచ్‌ల క్లిప్పింగులు, సచిన్ వాయిస్ ఓవర్ వంటి వాటితో దీనికి డాక్యుమెంటరీ లుక్ తెచ్చారు. ఇక ఆయన ఆడిన మ్యాచ్‌ల వీడియో క్లిప్పింగులను బిసిసిఐ నుంచి సచిన్ తన పలుకుబడితో ఉచితంగా ఇవ్వాలని వాదించాడు. కానీ దోని చిత్రం వారు కూడా డబ్బు చెల్లించే క్లిప్పింగ్‌లు తీసుకున్నారు కాబట్టి సచిన్ చిత్రానికి కూడా డబ్బు ఇవ్వాల్సిందేనని బిసిసిఐ ఘాటుగా సమాధానం చెప్పింది.
ఇక రాజ్యసభ ఎంపీగా, ఐపిఎల్‌లో ముంబైకి మెంటార్‌కు సచిన్ ఇప్పటికీ భారీగానే సంపాదిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన తనకు కాంగ్రెస్‌తో పాటు ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని తన చిత్రానికి వినోదపు పన్ను మినహాయించాలని కోరుతున్నాడు. కొన్ని రాష్ట్రాలు ఓకే అనేశాయి. కానీ వినోదపు పన్ను మినహాయింపు వల్ల ఈ డాక్యుమెంటరీ తీసిన వారికి పెద్ద మొత్తంలో లాభం ఉంటుందే కానీ ప్రేక్షకులకు ఏమీ ఉండదు.
కాగా ఒకప్పుడు ఇలాంటి చిత్రాలను, డాక్యుమెంటరీలను నామమాత్రపు టిక్కెట్టుకే పిల్లలకు థియేటర్లలో షోలు వేసేవారు. నిర్మాతలను వినోదపు పన్ను మినహాయింపు కాకుండా, ఈ చిత్రం ఆడే థియేటర్లలో టిక్కెట్ల రేట్లను తగ్గిస్తే నేటి యువతరం, బాలలు స్ఫూర్తిగా తీసుకునే వీలుంటుంది. ఈ దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి..!