ప్రస్తుతం బిజెపి తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటకలో బలపడేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ముఖ్యంగా ఆయన తన పర్యటనలో కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లకు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. అమిత్‌షా పర్యటన సందర్భంగా ఇతర పార్టీలలోని పలువురు ముఖ్యనాయకులతో పాటు దాదాపు 50మంది దాకా జడ్పీటీసీలు బిజెపి తీర్దం పుచ్చుకోనున్నారు.
పేరుకు కమ్యూనిస్ట్‌లకు వ్యతిరేకంగా అని అమిత్‌షా చెబుతున్నా పరిస్థితులు మాత్రం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లేనని తెలుస్తోంది. ఇక ఎంఐఎంను ఎదగనీయకుండా చేసేందుకు ఈ పర్యటనలో అమిత్‌షా పలు వ్యూహాలను రచించి, నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నాడు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. పేరుకు తమను టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నా గోల్ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై, మోదీపై తన అభిప్రాయాలను ప్రజలకు కేసీఆర్ సూటిగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా అమిత్‌షా నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా దళిత వాడలో సహపంక్తి భోజనాలు చేయనున్నారు. దీనిని నారాయణ విమర్శిస్తున్నాడు. బిజెపి వచ్చిన తర్వాత ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులపై దాడులు పెరిగాయని, గోసంరక్షణ పేరుతో ప్రాణాలు తీస్తున్నారని, ఆ పాపాలను పొగొట్టుకునేందుకే అమిత్‌షా దళితుని ఇంటిలో భోజనం చేస్తున్నాడని దుయ్యబడుతున్నాడు.