దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన చేయని వేరియేషన్స్ లేవు. టెక్నాలజీ సరిగా లేని రోజుల్లోనే 'విచిత్ర సోదరులు'లో మరుగుజ్జు పాత్ర చేశాడు. ఇక 'మైఖేల్ మదన కామరాజు'లోని క్యారెక్టర్లను బేస్ చేసుకుని ఎన్నో చిత్రాలు వచ్చాయి. 'పుష్పక విమానం' వంటి మూకీ చిత్రం తీసి విజయం సాధించడం ఆయనకే సాద్యమైంది. 'దశావతారం; విశ్వరూపం'ల గురించి, 'సాగరసంగమం, ఆకలిరాజ్యం' వంటి చిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
కేవలం 15 నుంచి 20కోట్లనే భారీ బడ్జెట్ అనుకుంటున్నరోజుల్లో ఊహకి అందని విధంగా ఏకంగా 100కోట్లకు పైగా బడ్జెట్‌తో అందునా రాణి ఎలిజిబెత్‌ని తీసుకొచ్చి 'మరుదనాయగం' సినిమా ప్రారంభించాడు. అది మధ్యలో ఆగిపోయింది. అది వేరే సంగతి. ఇక 'విశ్వరూపం' వంటి కాన్సెప్ట్‌ను ఎవ్వరూ హ్యాండిల్ చేయలేరు. దానికి ఎంతో దమ్ముకావాలి. ఇవ్వన్నీ చెబితే తెలుగు వారిని కించపరిచి తమిళనాడు వారిని, పరాయిభాష వారిని పొగడ్తలతో ముంచెత్తే భావదారిద్య్రాన్ని అందరూ మనకి అంటగడుతారు.
ఇక 'బాహుబలి' విషయానికి వస్తే ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2000కోట్లకు చేరుకుంటూ ఎవ్వరూ టచ్ చేయలేని స్థితికి చేరుకుంది. దీనిని కేవలం తెలుగు వాడి సత్తా చాటిన చిత్రంగా, తెలుగు కీర్తిని ప్రపంచ వీధుల్లో చాటిచెప్పిన చిత్రంగా భావిస్తున్నారు. చివరకు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వారు కూడా ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తాల్సిన పరిస్థితి. మౌనంగా ఉన్నా, లేక బాహుబలిలోని తప్పులను ఎత్తిచూపినా, సినిమాకథలో దమ్ములేదని చెప్పినా వారు కావాలని ఈ చిత్రాన్ని చులకన చేస్తున్నారని, జెలసీతో ఫీలవుతున్నారని భావించే విధంగా పరిస్థితి ఏర్పడింది.
తాజాగా కమల్‌ని 'బాహుబలి' వంటి చిత్రం చేస్తారా? అని అడిగితే ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. నేనేం గొర్రెను అనుకున్నారా? కనీసం నేను గొర్రెల కాపరిని కూడా కాదు. నేను వేరే రకం జంతువును. 'బాహుబలి' వంటి చిత్రం మరలా నేను చేయడమేమిటని ఆయన కోపంగా బదులిచ్చాడు. బాహుబలిని చూసి తమిళనాడులో పులి, సంఘమిత్ర...వంటి చిత్రాలు పురుడుపోసుకోవడం పులిని చూసి నక్క వాతను పెట్టుకున్నట్లే. గతంలో కైకాల సత్యనారాయణ; జమున వంటి వారు కూడా 'బాహుబలి' విషయంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.