ఎప్పటి నుంచో మన రాష్ట్రాలలో సినిమా టిక్కెట్ల రేట్లను పెంచాలని నిర్మాతలు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇప్పటికే ఈ చవకైన వినోద సాధనం కొందరికే పరిమితమవుతోందని, సినిమా ఓపెనింగ్స్‌ని చూసి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గలేదనే వాదన సరికాదని, నాడు 100 మంది చూస్తే వచ్చే డబ్బు ఇప్పుడు 10మంది చూస్తేనే వస్తోందనే బలమైన వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పెద్ద చిత్రాల రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు.
కాగా తాజాగా కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం కారణంగా తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో టిక్కెట్ల రేట్లు భారీగానే పెరగనున్నాయి. దేశం మొత్తం 28 శాతం వినోదపు పన్నును కేంద్రం విధించింది. ఇక తెలుగు రాష్ట్రాలలో 15శాతం వినోదపు పన్ను వసూలు చేస్తున్నారు. కానీ ఇక నుంచి 28శాతం కట్టాల్సిందే. మరోపక్క కొన్నిరాష్ట్రాలలో 28శాతం కంటే ఎక్కువ వినోదపు పన్ను వసూలు చేస్తున్నారు. అక్కడ టిక్కెట్ల రేట్లు తగ్గుతాయి. ఇక తమిళనాడులో క్లీన్‌యు, తమిళంలోనే టైటిల్స్ ఉన్న చిత్రాలకు వినోదపు పన్ను మినహాయింపు ఉండేది.
కానీ ఇకపై అది వీలుకాదు. సో.. ఇక ఏదైనా సినిమా విడుదలైతే పైరసీని 50రూపాయలతో ఇంటిల్లిపాది చూడటమో, లేక మూడు నాలుగు నెలలు ఆగి ఆ సినిమా చానెల్స్‌లో ప్రసారం చేసినప్పుడు చూడటమో తప్పదని సామాన్య సినీ ప్రియులైన కుటుంబ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.