రజినీకాంత్‌కి నటునిగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆయన చంచల మనస్కుడనే పేరుంది. 1999లో వచ్చిన 'ముత్తు' చిత్రం ద్వారానే ఆయన తాను రాజకీయాలలోకి రానున్నట్లు సంకేతాలిచ్చారు. ఆయన సినిమా విడుదలకు సిద్దమైన ప్రతి సారీ ఆయన రాజకీయాలపై వార్తలు రావడం, తమిళనాడు రాజకీయాలు వేడెక్కడం, మరలా మామూలైపోతున్నాయి.
దీంతో సినిమా పబ్లిసిటీ కోసమే రజినీ ఇలా చేస్తారనే విమర్శ కూడా ఆయన మీద ఉంది. తాజాగా రాష్ట్ర రాజకీయాలు కుళ్లిపోతున్నాయని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, యుద్ద సైనికుల వలే అందరూ యుద్దానికి సిద్దంగా ఉండాలని ఆయన తాజాగా వ్యాఖ్యలు చేశాడు. యుద్దమంటే ఎన్నికలు, రాజకీయాలేనని పలువురు నమ్ముతున్నారు. గతంలో ఓ సారి ఆయన జయ ముఖ్యమంత్రి అయితే తమిళనాడును ఎవ్వరూ బాగుచేయలేరని చెప్పి, విపక్షాలైన డిఎంకే కరుణానిధి, మూపనార్‌ల మద్యమధ్యవర్తిత్వం నెరపి, ప్రతిపక్షాలు ఎన్నికల్లో గెలవడానికి దోహదం చేశాడు.
ఇక ముఖ్యమంత్రి జయ ఉండే పోయెస్‌గార్డెన్ దగ్గరే రజినీ నివాసం కూడా ఉంది. కాగా ఒకరోజు ముఖ్యమంత్రి జయ వస్తున్నారని గంటసేపు ట్రాఫిక్‌ను ఆపేశారు. దాంతో సహనం నశించిన రజినీ కారు దిగి నడిచాడు. అది సంచలనం సృష్టించింది. దానిని రజినీ ఘోర అవమానంగా భావించాడంటారు. కాగా మూపనార్ రజినీని రాజకీయాలలోకి రమ్మని చెప్పి, జయకు పోటీ ఇవ్వమని చెప్పినా రజినీ మౌనం వహించాడు.
ఇక ఆయన తాజాగా స్టాలిన్‌పై కూడా పొగడ్తల వర్షం కురిపించాడు. దీన్ని బట్టి ఆయన రాజకీయ రహదారి చూచాయగా అర్ధమవుతోంది. మరి కొందరు మాత్రం ఇది '2.0' పబ్లిసిటీకి చేస్తున్న గిమ్మిక్కుగా భావిస్తున్నారు. ఆయన వరుస చిత్రాలను ఒప్పుకోవడమే దానికి నిదర్శనం అంటున్నారు.