వాస్తవానికి 2014 ఎన్నికలలోనే బిజెపి తమ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోదీని ప్రకటించింది. దీంతో దేశం యావత నమో జపం చేశారు. ఇక బిజెపి బలహీనంగా ఉన్న ఏపీలో మొదట బిజెపి నాయకులు జగన్‌కి చెందిన వైయస్సార్‌సీపీతో పొత్తుకు ప్రయత్నించారు. కానీ తాను అతి తేలికగా గెలవగలననే ఓవర్‌కాన్ఫిడెన్స్, తనకు ఎవ్వరి మద్దతు లేకపోయినా కాబోయే ముఖ్య మంత్రిని నేనే అనే అత్యుత్సాహం వల్లనే జగన్ బిజెపి అభ్యర్ధనను తోసిపుచ్చాడని అంటున్నారు.
ఇక బిజెపితో పొత్తు పెట్టుకుంటే తనకు భారీ బలం ఉన్న ముస్లిం, మైనార్టీ ఓట్లు పోతాయనేది కూడా ఆయన భయానికి కారణం. ఇక పోయిన ఎన్నికల్లో కూడా టిడిపి, బిజెపిల పొత్తును ఎవ్వరూ ముందుగానే ఊహించలేదు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీని హైదరాబాద్‌కి గానీ, సమైఖ్య ఏపీలోకి కూడా రానివ్వనని, ఆయన ఓ మతోన్మాది అని చంద్రబాబు తిట్టాడు.
ఇక మోదీ కంటే తానే సీనియర్ ముఖ్యమంత్రిని, రాజకీయనేతను, ఏకంగా ప్రధాని పదవి వచ్చి వరించినా తిరస్కరించానని, తన ముందు మోదీ ఓ బచ్చాగా చంద్రబాబు అభివర్ణించి ఉన్నాడు. దాంతో బిజెపి కూడా టిడిపిపై పొత్తుపై 2014లో మొదట ఉత్సాహం చూపలేదు. కానీ అటు టిడిపి, లేదా వైసీపీ మద్దతు లేనిదే ఏపీలో నెగ్గుకురాలేమని భావించిన బిజెపి చివరకు వెంకయ్యనాయుడు చొరవతో టిడిపితో కలిసింది. ఇక బిజెపి దక్షిణాదిలో కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
ఏమాత్రం బలంలేని దక్షిణాదిలోని 120కి పైగా స్థానాలలో 2014లో బిజెపి ద్వితీయ స్థానం సంపాదించడం విశేషం. ఇక తాము టిడిపితో ఎంత కాలం కలిసి పనిచేసినా చంద్రబాబు చాణక్యత ముందు తమ బిజెపి ఏపీలో బలపడలేదని, పెద్దగా అనుభవం లేని జగన్ వంటి వారితో చేరితేనే మిత్రపక్షంగా ఉంటూనే పార్టీని సొంతంగా బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచన బిజెపి చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.