వివాదాస్పద రాజకీయ నాయకుడు, న్యాయకోవిదులు సుబ్రహ్మణ్య స్వామి నోటి వెంట ఏమి వచ్చినా అది సంచలనమే. ఇప్పటికే రజనీ తమిళుడు కాదని,ఆయనకు తమిళనాడు సీఎం అయ్యే అర్హతలు లేవని చెప్పిన స్వామి తాజాగా కొందరు సినీ రాజకీయ నాయకులపై నిప్పులు కురిపించారు. తమిళనాడులో కామరాజ్, రాజ గోపాలా చారి మినహా మరే సినీ నటుడు రాజకీయంగా సరిగ్గా వ్యవహరించలేదని, అందరూ విఫలమయ్యారని వ్యాఖ్యానించాడు.
ఎంజీఆర్, జయలలితలు కూడా రాజకీయంగా విఫలమయ్యారన్నారు. ఇక స్వర్గీయ తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, అతి తక్కువ సమయంలోనే పార్టీని పెట్టి, సీఎంగా పనిచేసిన ఎన్టీఆర్ శుద్దవేస్ట్ అని, ఆయన అన్ని విషయాలలోనూ పూర్తిగా వేస్ట్ అన్నారు. ఇక సినిమాలలో రాణించి రాజకీయాలలో కూడా రాణిస్తున్న శుతృఘ్నుసిన్హా వంటి కొందరు మాత్రమే రెండింటిలో సక్సెస్ అవుతున్నారని చెప్పాడు.
ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారిలో ఘోరంగా విఫలమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని ఆయన తేల్చేశారు. ఇక నాడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఓ జోకర్‌గా అభివర్ణించారు. ఇక రజనీ రాజకీయ అరంగేట్రాన్ని ఆయన జోక్‌గా పేర్కొన్నారు. రజనీకి సిద్దాంతాలు, నిలకడ లేవని, ఆయనకు చదువు రాదని, తమిళుడే కాదని, మరాఠీ అయిన కన్నడిగుడని ఆయన్ను మరోసారి ఎద్దేవా చేశారు.
ఆయనకు ఎందరో అభిమానులు ఉండ వచ్చని, కానీ వారు గొర్రెల మందలని, వారు రజనీని నటునిగా ఆరాధిస్తున్నారే గానీ ఆయన సిద్దాంతాలను చూసి కాదన్నారు. అసలు రజనీకి రాజ్యాంగమే తెలియదని హేళన చేశారు. మొత్తానికి సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు పలు వివాదాలను సృష్టించే విధంగా కనిపిస్తున్నాయి.