తాము చెప్పినట్లు రాయలేదని జర్నలిస్ట్‌లను వేధిస్తారు. మీడియాను ప్రకటనల నుంచి అన్ని విధాలుగానూ బెదిరిస్తారు. అధికారంలో ఉంటే మా దయ వల్లనే మీరు బతుకుతున్నట్లు మాట్లాడుతారు. తమకు ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని, తమ వెంట ప్రజలు ఉన్నారని ఊదరగొడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఓడిపోవడానికి మీడియానే కారణమని బూతులు తిడతారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామంటారు. ఇలా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న వారికి తిట్టడానికి పనికి వచ్చే వ్యవస్థే మీడియా. ఇక టిడిపి, వైసీపీల పోకడలను చూస్తుంటే ఇద్దరు ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్లు తమ అనుకూల మీడియాను వాడుకుంటున్నారు. వ్యతిరేక మీడియాను ఎలా లొంగతీసుకోవాలి? వారి పని ఎలా పట్టాలి? అని లెక్కలు వేసుకుని కులాల కుంపట్లు రాజేసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు భ్రష్టు పట్టిస్తున్నారు.
ఓ సామాజిక వర్గం అందరూ కలిసి టిడిపిని మెచ్చుకుంటూ, వైసీపీ మీద కులపరమైన కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా తక్కువ తినలేదు. రాబోయేది మేమే.. నరుకుతాం.. చంపుతాం.. అంటూ వారు కూడా కులాల పోరులో కుమ్ముకుంటున్నారు. అసలు కులం పట్టించుకోని వారికి కూడా వీటిని చూస్తే కులకంపు అంటుకోవడం ఖాయమని ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలను చూస్తే అర్థమవుతోంది.
ఎవరెన్ని అన్నా రవికిరణ్ ఇంటూరి, ఇప్పాల రవీంద్ర ఇద్దరిపై టిడిపి వైఖరి, అత్యుత్సాహం, వారిని కట్టడి చేసి, మొద్దు శ్రీనులా చేస్తామని బెదిరిస్తున్న తీరు బాధాకరం. వ్యక్తిగత దూషణలకు, అర్ధనగ్న దృశ్యాల మార్ఫింగ్‌లు వంటివి ఉంటే సోషల్ మీడియాలో ఉండేది ఈ రెండు కులాల వారే కాదు.. అన్ని కులాల వారు నేడు ఫేస్‌బుక్‌లలో, ట్విట్టర్లలో చురుగ్గా ఉన్నారు.
ఇలాంటి చెత్త పోస్టింగ్‌లు వస్తే వాటిని చూసి మిగిలిన వారు అందరూ చీకొట్టే పరిస్థితి ఉంది. టిడిపి మహిళా ఎమ్మెల్యేలను రవికిరణ్, రవీంద్ర అలా చూపిస్తే దాని ఎఫెక్ట్ వైసీపీ మీదే పడుతుంది.. టిడిపిపై సానుభూతి పెరుగుతుంది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు. మరి గతంలో వైయస్సార్ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి వారు సోషల్ మీడియాలో ఏం చేశారో గుర్తు చేసుకోవాలి. స్వయాన మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చేసిన వ్యాఖ్యలను చూస్తే తీవ్రత అర్ధమవుతోంది.