కొన్ని హిట్ చిత్రాల కథలు కొందరి వద్దకు వెళ్లడం, వారు వద్దనుకోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల వారు ఆ చిత్రాలు చేయలేకపోవడం, తర్వాత అవే చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన తర్వాత తలలు పట్టుకుని బాధపడటం సహజంగా జరిగే పరిణామమే. మహేష్, పవన్, రవితేజ వంటి ఎందరికో ఇలాంటి పరిస్థితులు ఎదురైయ్యాయి.
ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న 'బాహుబలి' విషయంలో కూడా కొన్ని పాత్రల విషయంలో ఇవే జరిగాయి. మొదటగా రాజమాత శివగామి పాత్రను శ్రీదేవిని అడగటం, ఆమె అదిరిపోయే రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా లాభాలలో కూడా వాటాలు అడగడంతో ఆమెకు ఆ చాన్స్ మిస్ అయి రమ్యకృష్ణకు వరించింది. అసలు రమ్యకృష్ణ కాబట్టే ఆ పాత్రకు అంత బాగా న్యాయం చేయగలిగిందని, సినిమాకు, ఆ పాత్రకు నిండుదనం తెచ్చిందని కూడా చెప్పాలి.
మరోపక్క 'బాహుబలి'లో ప్రభాస్, రానాలతో పాటు రమ్యకృష్ణ, కట్టప్పగా నటించిన సత్యరాజ్‌ల పాత్రలు కూడా ఎంతో ఎలివేట్ అయి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయేలా ఉన్నాయి. ఇక కట్టప్ప పాత్రకు తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ జీవం పోశాడు. శివుడి కాలును తన నుదిటికి అద్దుకునే సీన్ నుంచి ప్రతి సన్నివేశంలో ఆయన చూపించిన నటన నభూతోనభవిష్యతి. కాగా ఈ పాత్రకు మొదట మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ని అనుకున్నారట. కానీ విచిత్రంగా ఆ పాత్ర సత్యరాజ్‌ను వరించింది. ఇక తమన్నా నటించిన అవంతిక పాత్రను కూడా మొదట సోనమ్‌కపూర్‌ను తీసుకుని తర్వాత తమన్నా చేతికి దొరికిన సంగతి తెలిసిందే.