నిర్మాతగా, దర్శకునిగా కరణ్ జోహార్‌కి ఉన్న పలుకుబడి బాలీవుడ్‌లో ప్రస్తుతం మరెవ్వరికీ లేదంటే ఎవరైనా ఒప్పుకుంటారు. ఆయన ధర్మ ప్రొడక్షన్ అండతో ఇటీవలి కాలంలో 'బాహుబలి-ది బిగినింగ్', తాజాగా 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాలు ఓ తెలుగు డబ్బింగ్ చిత్రాలుగా గాక, స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాల కంటే సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో రాజమౌళి, విజయేంద్రప్రసాద్, కీరవాణి వంటి వారితో పాటు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి వారి పాత్ర కూడా ఉంది. కానీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రానికి క్రేజ్ తెచ్చిన ఘనత మాత్రం కరణ్‌జోహర్‌కే దక్కుతుంది.
మరొకరు అయితే ఆ రేంజ్‌లో ఆ చిత్రాలను ప్రమోట్ చేయగలిగి, ఇతర బడాస్టార్స్ చిత్రాలను కూడా భయపెట్టి, అన్ని థియేటర్లను, అంతగా ఓపెనింగ్స్‌ని సాధించడం సాధ్యమయ్యే పని కాదు. పైపైచ్చు సినిమాపై కావాలని నెగటివ్ ప్రచారం, దక్షిణాది చిత్రాన్ని అందునా ఓ తెలుగు చిత్రాన్ని బాలీవుడ్‌లో ఇంతలా ప్రమోట్ చేసినందుకు కరణ్ అందరికీ శత్రువయ్యే వాడే. కానీ ఈ విషయంలో కరణ్ జోలికి ఎవరూ రాలేదు. ఇంకా ఆయన కాంపౌండ్ వారు బయటకు చెప్పకపోయినా వెనకుండి ప్రోత్సహించారు. ఇక రానా హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఘాజీ'ని కూడా ఆయన ప్రేక్షకులకు చేరువ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దాంతో మన టాలీవుడ్ వారికి ఆయన సత్తా ఏపాటిదో తెలిసివచ్చింది.
త్వరలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని లాడ్జ్ స్కేల్‌లో తీయాలని భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత చరణ్‌లు కూడా తెలుగులో ఈ చిత్రం విషయం తాము చూసుకుంటామని, ఇక కోలీవుడ్, మాలీవుడ్‌లలో కూడా తామే మాయచేయగలమని, కానీ బాలీవుడ్‌లో మాత్రం కరణే మాకు సహాయం చేయాలని చర్చలు సాగిస్తున్నారని సమాచారం. లాభాల వాటా, ఇతర పద్దతులన్నింటినీ కరణ్ కండీషన్స్‌కే ఒప్పుకుంటామని, కానీ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో మాత్రం ఆయనే తీసుకోవాలని కోరుతుండటాన్ని బట్టి కరణ్ ప్రస్తుతం దక్షిణాది చిత్రాలకు బాలీవుడ్‌లో ఎలాంటి ఆపద్బాంధవుడిగా మారాడో అర్దమవుతోంది.