ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయిలే అని సామాన్యులు అనుకోవచ్చు. కానీ తమకు పూర్తి మెజార్టీ ఇచ్చినా.. ప్రభుత్వాలు పూర్తి ఐదేళ్లు పాలించాల్సిన విషయాలను పక్కనపెట్టి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్నాయనే వార్తలు కొంతకాలంగా వస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బిజెపిని ఏయో స్థానాలలో నిలబెట్టాలి? ప్రస్తుతం అక్కడ ఉన్న సిట్టింగ్స్ పనితీరు ఎలా ఉంది? వంటి విషయాలపై మోదీ ప్రత్యేక సర్వే చేయిస్తున్నారని, పట్టులేని ప్రాంతాలలో కూడా ఆయన పాగా వేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
మరోపక్క జమిలీ ఎన్నికలపై కూడా వాదనలు బయటకు వస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు గెలుపుగుర్రాలు అనే దానిపై చంద్రబాబు కూడా కసరత్తు చేస్తున్నాడు. ఐవిఆర్‌ఎస్ సర్వే ద్వారానే ఈసారి కూడా చంద్రబాబు సీట్లు కేటాయించనున్నాడట. కిందటి ఎన్నికల్లో కూడా ఆయన అదేదారిని ఎంచుకున్నాడు. తాను ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు రూపుదిద్దినా కూడా వాటిని పేదల వరకు చేరవేయడంలో పార్టీ క్యాడర్ విఫలమవుతోందని , దాంతో తాను పడుతున్న కష్టం బూడిదపాలవుతోందనే నిరాశ, కోపంలో ఆయన ఉన్నారు.
మరోవైపు ఎన్నికల నాటికి ఇతర పార్టీలలోని అసంతృప్తి నేతలు ఎవరిని తమ పార్టీలో చేర్చుకోవాలి? వారి వలన తనకు లాభమా? నష్టమా? అనే బేరీజుల్లో వైసీపీ ఉంది. ఇక జనసేన తనకు పట్టున్న సీట్లు ఏవి? ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? అన్ని స్థానాలకు పోటీ చేయకుండా కొన్నింటినే ఎంచుకోవాలనే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. దీంతో ఇప్పుడే రాజకీయ వేడి రగులు కుందని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టత రానుందని సమాచారం.