ఎంతకాలంగానో ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు ఎట్టకేలకు మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం, దీనిపై చంద్రబాబు మోదీని ఏమీ అనకుండా జగన్‌నే టార్గెట్ చేస్తూ ఉండటం, జగన్ కూడా ప్రత్యేకహోదా నుంచి అన్ని విషయాలలో మోదీని పల్లెత్తుమాట అనకుండా టిడిపినే టార్గెట్ చేస్తుండటం వంటివి ప్రస్తుతం సామాన్యులకు కూడా ఈ రాజకీయ క్రీనీడ అర్ధమవుతోంది.
మోదీతో జగన్ ఏమి మాట్లాడాడు అని తెలుసుకునేందుకే చంద్రబాబు అమెరికా నుంచి వచ్చి ఢిల్లీలో 6గంటలు రహస్యంగా గడిపాడని, ఈ సమయంలో తనకు ఆప్తులు, తనకు అండగా ఉంటున్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, సురేష్‌ప్రభు వంటి వారిని కలిశాడంటున్నారు. కాగా మోదీతో జగన్ భేటీ సమయంలో మోదీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామనే ప్రతిపాదనను కాస్త చూచాయగా జగన్‌కి తెలిపినప్పటికీ జగన్ మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని, తనకు ముస్లిం మైనార్టీలలో మంచి బలం ఉన్నందువల్ల వచ్చే ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేసి, ఎన్నికల అనంతరం కలుద్దాం... నడుద్దామనే ప్రతిపాదనను తెచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు శశికళ నుంచి తాజాగా చిదంబరం, లల్లూప్రసాద్ యాదవ్ వంటి వారిని కూడా కేంద్రం టార్గెట్ చేస్తున్నందువల్ల ఆ ప్రమాదం తనకు రాకుండా చూసుకొనేందుకే జగన్ ఈ వ్యూహం పాటించాడని అంటున్నారు. మరి ముస్లిం మైనార్టీలు జగన్ ఎత్తుగడలను అర్దం చేసుకుంటారా? లేక మరోసారి ఆయన ఉచ్చులోనే పడతారా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది.